Ind Vs Aus 4th Test: మెల్ బోర్న్ టెస్టులో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 33 పరుగులపై మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ టీమిండియా ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఒక్కో పరుగు తీస్తూ ఆస్ట్రేలియాపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఇలా వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 88 పరుగులు జోడించారు. అత్యంత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో వీరిద్దరిని విడదీయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ట్రావిస్ హెడ్ ను రంగంలోకి దింపాడు. సరిగ్గా 58 ఓవర్ లో బంతిని చేతిలోకి తీసుకున్న హెడ్.. నాలుగో బాల్ కు పంత్ ను అవుట్ చేశాడు. హెడ్ వేసిన బంతిని షాట్ కొట్టిన పంత్..మార్ష్ చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఊపిరి పీల్చుకుంది. 121 పరుగుల వద్ద పంత్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా.. మిగతా 6 వికెట్లను 34 పరుగుల వ్యవధిలోనే నష్టపోయింది. దీంతో 155 పరుగులకే కుప్పకూలి.. ఆస్ట్రేలియా చేతిలో 185 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది.
ఆస్ట్రేలియా ఎలాగైనా వాడుకుంటుంది..
ఒక ప్లేయర్ జట్టుకు ఏ విధంగా ఉపయోగపడతాడు ఆస్ట్రేలియా టీం మేనేజ్మెంట్ కు బాగా తెలుసు. అందువల్లే ఒక ఆటగాడిని ఎంపిక చేసే క్రమంలో చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. అతడి బ్యాటింగ్ పరిశీలిస్తుంది. బౌలింగ్ ను అంచనా వేస్తుంది. ఫీల్డింగ్ ను పసిగడుతుంది. ఇన్ని విభాగాలలో అతడు రాటు తేలిన తర్వాతే జట్టులోకి తీసుకుంటుంది. అందువల్లే ఆస్ట్రేలియాలో ఏ ఆటగాడు అయినా సరే ఏదో ఒక సందర్భంలో జట్టుకు పనికి వస్తాడు. అక్కడిదాకా ఎందుకు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా అన్ని వికెట్లు పోయిన బౌలర్ లయన్ నిలబడ్డాడు. ఏకంగా 41 పరుగులు చేశాడు. అతడు అలా పరుగులు చేయడం వల్లే టీమిండియా ఎదుట ఆస్ట్రేలియా 340 పరుగుల టార్గెట్ విధించింది. అంతేకాదు లయన్ వల్ల చివరి వికెట్ కు ఆస్ట్రేలియా 61 పరుగులు జోడించింది. ఇటీవల కాలంలో ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో చివరి వికెట్ కు ఇన్ని పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జట్టు అంటూ లేదు. అందువల్లే క్రికెట్ ఆస్ట్రేలియా కు ఆడటానికి ఆ జట్టు ఆటగాళ్లు గర్వంగా భావిస్తారు. దేశమే ముందు.. తర్వాత మేము అనే సిద్ధాంతాన్ని పాటిస్తారు. అందువల్లే ఆ జట్టు ఈ స్థాయిలో విజయాలు సాధిస్తోంది. ఎవరికీ సాధ్యం కాని.. రికార్డులను సొంతం చేసుకుంటున్నది. కాగా, హెడ్ ఎప్పుడైతే రిషబ్ పంత్ వికెట్ పడగొట్టాడో.. అప్పటినుంచి మ్యాచ్ పూర్తిగా ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటిదాకా పంత్, యశస్వి జైస్వాల్ మీద టీం ఇండియా మేనేజ్మెంట్ కు ఎంతో కొంత ఆశలు ఉండేవి. ఎప్పుడైతే ఈ వికెట్ పోయిందో. . అప్పుడే ఆస్ట్రేలియా మ్యాచ్ మీద మరింత పట్టు బిగించింది.