Paris Olympics 2024: సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు మనిషి జీవితాన్ని మరింత సుఖవంతం చేస్తున్నాయి. అయితే ఆధునిక సాంకేతికతను ఈసారి ఒలింపిక్ క్రీడలకూ అనుసంధానించారు. క్రీడాభిమానులకు సరికొత్త సాంకేతిక అనుభవాన్ని కళ్ళ ముందు ఉంచారు. దీంతో సంబ్రమాశ్చర్యానికి గురి కావడం వారివంతయింది. పారిస్ వేదికగా ఒలింపిక్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా ప్రారంభ వేడుకలు నదిలో జరిగాయి. అయితే ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఒలింపిక్ జ్యోతి ఆగమనం నిలిచింది. ప్రత్యేకమైన పడవలో ముసుగు ధరించిన వ్యక్తి ఒలింపిక్ జ్యోతిని చేతిలో పట్టుకొని వచ్చాడు.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేలా నినాదాలు చేశాడు. పారిస్ లోని ప్రత్యేకతలన్నింటినీ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రయాణం కొనసాగించాడు. గాల్లో నుంచి తాడు సాయంతో ఎగిరాడు. చూసేవాళ్ళకు ఇది అద్భుతం, అనన్య సామాన్యంగా కనిపించింది. అలా ఎగురుతూ అతడు నదిని దాటాడు. అంతేకాదు వర్చువల్ సాంకేతికతను ఉపయోగించి.. ఆ ముసుగు ధరించిన వ్యక్తి ఫ్రెంచ్ చరిత్రను కళ్ళకు కట్టాడు. పారిస్ వారసత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించాడు. వర్చువల్ సాంకేతికత సహాయంతో ఒక్కో విశిష్టమైన ప్రదేశాన్ని ఒక్కో తీరుగా ప్రదర్శించాడు. మిగతా కళాకారులు కూడా అనేక రకాలుగా విశిష్టమైన ప్రదర్శనలు చేశారు. క్రీడాభిమానులను అమితంగా ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒలింపిక్ గీతాలకు కళాకారులు లయబద్ధంగా స్టెప్పులు వేశారు. ఒలింపిక్స్ ప్రత్యేకతను చాటేలా వీడియోలు రూపొందించారు. ఒలింపిక్స్ పుట్టుక, దాని నేపథ్యం, విస్తరించిన తీరును పలు రూపాలలో ప్రదర్శించారు. ఆకృతులకు తగ్గట్టుగా డిజిటల్ ఎమోజిలను రూపొందించి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఒలింపిక్ ప్రారంభ వేడుకల్లో ఇవి హైలెట్ గా నిలిచాయి. వేడుకలకు హాజరైన ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి.
ప్రేమనగరి ప్రత్యేకత
ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పారిస్ నగరం ప్రత్యేకతను తెలిపే విధంగా ఆకాశంలో విమానాలను నడిపారు. వాటి పొగతో భారీ లవ్ సింబల్ ఆకృతిని రూపొందించారు. అది క్రీడాభిమానులను ఆశ్చర్యంలో ముంచగా.. వినీలాకాశానికి సరికొత్త సొబగులు అద్దింది. ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులు వారి వారి సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకలకు హాజరయ్యారు. వారి జాతీయతను ప్రదర్శించేలాగా నేషనల్ ఫ్లాగ్ లతో మార్చి ఫాస్ట్ చేశారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. క్రీడాకారులు ప్రదర్శన చేస్తున్నప్పుడల్లా పారిస్ దేశానికి చెందిన కళాకారులు విభిన్నంగా స్వాగతం పలికారు.
ఆకాశమే హద్దుగా..
ప్రారంభ వేడుకలు ఆకాశమే హద్దుగా జరిగాయి. ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా నదిలో జరిగిన సంబరాలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. బాణాసంచా పేలుళ్లు, కళాకారుల నృత్యాలు, ఆశ్చర్యాన్ని కలిగించే విన్యాసాలు క్రీడాభిమానులకు ఆనందాన్ని కలిగించాయి. ఈ వేడుకలకు దాదాపు 3 లక్షల 20వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారని ఒలింపిక్ కమిటీ తెలిపింది. ఒలింపిక్ చరిత్రలో ప్రారంభ వేడుకలకు ఈ స్థాయిలో ప్రేక్షకులు రావడం ఇదే తొలిసారి. ఈ వేడుకలను చూసేందుకు దాదాపు 80 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.. ఈ ప్రారంభ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఆటగాళ్లు, వ్యాపార ప్రముఖులు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు హాజరయ్యారు. ఈ ఒలింపిక్ ప్రారంభ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా ఒలింపిక్ నిర్వహణ కమిటీ పంచుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి.
The Olympic flag is being raised to the Olympic Anthem, performed by 60 choristers from the Radio France Choir, and 90 musicians from the French National Orchestra.
Look closely – the Trocadéro stage is shaped like the Eiffel Tower! #Paris2024 #OpeningCeremony pic.twitter.com/sLhp3jFEds
— The Olympic Games (@Olympics) July 26, 2024