Mona Agarwal Paralympics: పారా ఒలింపిక్స్ లో భారత్ షూటర్లు మెడల్స్ సాధించారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని బంగారుకొండగా ఆవిర్భవించింది. అయితే ఇదే విభాగంలో 37 సంవత్సరాల మోనా అగర్వాల్ కాంస్యం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అవని లాగే మోనా స్వస్థలం రాజస్థాన్.. రాజస్థాన్లోని సికార్ ప్రాంతానికి చెందిన మోనా 9 నెలల వయసులోనే పోలియో వ్యాధికి గురైంది. చక్రాల కుర్చీకి పరిమితమైంది. దీంతో చిన్నతనంలో ఆమెను అందరు హేళన చేసేవారు. పైగా మోనా తన తల్లిదండ్రులకు మూడవ సంతానం. దీంతో బంధువులు కూడా ఆమెను చులకనగా చూసేవారు. ఇన్ని చీత్కారాలను ఎదుర్కొన్న ఆమె.. వాటన్నింటినీ పంటి కింద భరించింది. అన్నింటిని పట్టించుకోకుండా తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పైగా పట్టుదలను పెంచుకుంది. ఈ దశలో అమ్మమ్మ గీతాదేవి మోనాకు బాసటగా నిలిచింది.
చిన్నప్పటినుంచి క్రీడల్లో రాణించాలని కల
మోనాకు చిన్నప్పటినుంచి క్రీడల్లో రాణించాలనే కల ఉండేది. ఆమె కలను అర్థం చేసుకొని తండ్రి క్రీడల వైపు ప్రోత్సహించారు. ఆమె తండ్రి హార్డ్వేర్ షాప్ నిర్వహించేవాడు.. తండ్రి ప్రోత్సాహంతో మోనా క్రీడల్లో రాణించేది.. షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో క్రీడల్లో సత్తా చాటింది. రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ చూపింది.. 2017లో పారా బాస్కెట్ బాల్ ఆటగాడు రవీంద్ర చౌధరి తో మోనా తో వివాహమైంది.. వివాహం అనంతరం ఆమె ఉదయపూర్ వెళ్లిపోయింది. అనంతరం పారా వెయిట్ లిఫ్టింగ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 60 కిలోల విభాగంలో రాష్ట్రస్థాయి టైటిల్ దక్కించుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత 2021 లో తన భర్త సహకారంతో పారా షూటింగ్ విభాగంలోకి ప్రవేశించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతంలో ఏకలవ్య షూటింగ్ అకాడమీలో ప్రవేశించింది. యోగేష్ శకావత్ శిక్షణలో రాటు తేలింది. ఆ తర్వాత అదే సంవత్సరం జూలై నెలలో క్రొయేషియా దేశంలో జరిగిన పారా వరల్డ్ కప్ షూటింగ్ పోటీలలో అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అన్ని క్రీడల్లో ప్రతిభ చాటింది
గత ఏడాది ఏప్రిల్ నెలలో దక్షిణ కొరియా ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ కప్ లో స్వర్ణ పతకాన్ని సాధించింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్ లో పారిస్ క్రీడల బెర్త్ సాధించింది. చిన్నతనంలో చుట్టుముట్టిన పోలియోను లెక్కచేయకుండా.. వైకల్యాన్ని అధిగమించి.. దాదాపు అన్ని క్రీడల్లో ప్రతిభ చాటి.. చివరికి పారా ఒలంపిక్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన మోనాను నెటిజన్లు అభినందిస్తున్నారు.. దేశంలో యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడుతున్నారు.