Heavy Rains: తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవలేదు. ఎగువన కురిసిన వర్షాలకే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెకులు నిండాయి. రెండు రాష్ట్రాల్లో కూడా లెక్కల ప్రకారం సాధారణ వర్షాపాతం నమోదైనా జలాశయాలు, చెరువులు, కుంటలు నిండేలా వరదలు వచ్చే వానలు చాలా తక్కువ ప్రాంతాల్లో కురిశాయి. దీంతో ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో సాగువిస్తీర్ణం తగ్గింది. ఇదిలా ఉంటే.. మరో నెల రోజుల్లో వర్షాకాలం పూర్తవుతుంది. రెండు రాస్ట్రాల్లో ఇప్పటికీ చాలా జలాశయాలు ఖాళీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఐఎండీ అంచనా మేరకు తెలుగు రాస్ట్రాల్లో శుక్రవారం(ఆగస్టు 30) నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గుజరాత్ పక్కన తుపాను..
భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన తాజా బులిటెన్ ప్రకారం గుజరాత్ పక్కన తుపాను ఏర్పడింది. దానికి ఏస్నా అనే పేరు పెట్టారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా లేదు. గుజరాత్‌లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. వాయుగుండం కూడా బలంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతోంది. మరోవైపు నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. ఈ పరిస్థితి వల్ల తెలుగు రాష్ట్రాల్లో వారంపాటు వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలోని కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకూ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో సెప్టెంబర్ 3 వరకూ అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురుస్తాయని ప్రకటించింది.
శాటిలైట్స్ అంచనాలు ఇలా..
ఇక శాటిలైట్స్ లైవ్ అంచనాలను గమనిస్తే, రాత్రి నుంచి కోస్తాంధ్ర, మధ్య తెలంగాణ, ఉత్తరాంధ్ర, హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం(ఆగస్టు 31న) ఉదయం నుంచి మొత్తం తెలంగాణ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో దక్షిణ రాయలసీమ తప్ప మిగతా అంతటా మోస్తరు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితి రోజంతా ఉంటుంది. అర్థరాత్రి తర్వాత కూడా ఉంటుంది. సెప్టెంబర్ 1న తెల్లవారుజాము తర్వాత ఏపీలో కొంత వాన తగ్గుతుంది. కానీ తెలంగాణలో మాత్రం వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది.
హైదరాబాద్‌కు ఆరంజ్ అలర్ట్..
శనివారం హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒక సర్కిల్ లాంటి సుడి హైదరాబాద్ పరిసరాల నుంచి బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. ఈ సుడి వల్ల ఉదయం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. జీహెచెంసీ అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు.
బలమైన గాలులు..
అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గాలి వేగం గంటకు 11 నుంచి 25 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 10 నుంచి 17 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ సాయంత్రానికి విశాఖలో గాలి వేగం బాగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఉష్ణ్రోగ్రతలు బాగా తగ్గాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయి. ఏపీలో 26 డిగ్రీల సెల్సియస్సే ఉంటుంది. ఇంత తక్కువగా ఇటీవల ఎప్పుడూ లేవు. ఇక గాలిలో తేమ అధికంగా ఉంటుంది. తెలంగాణలో 87 శాతం, ఏపీలో 92 శాతం వరకు ఉంటుంది. ఇంత భారీగా తేమ తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య ఎప్పుడూ లేదు.