Pakistan Vs Canada: అమెరికాతో ఓడిపోయింది. భారత్ తో భంగపడింది.. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.. టోర్నీలో కచ్చితంగా కొనసాగాలంటే గెలవాల్సిన మ్యాచ్లో.. గెలిచింది.. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్ లో కెనడాపై గెలిచి బోణి కొట్టింది.. కొడిగట్టిన సూపర్ -8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది దాయాది పాక్.. మహమ్మద్ అమీర్ (2/13), హరీస్ రౌఫ్(2/26) విజృంభించడంతో కెనడా 20 ఓవర్లలో 106/7 వరకే పరిమితమైంది. అరోన్ జాన్సన్(53; 53 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తో నిలబడటంతో ఆ మాత్రం టార్గెట్ నైనా పాక్ ముందు ఉంచింది.. ఇక 107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.. కెప్టెన్ బాబర్ అజాం (33; 33 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత్ నేర్పిన ఓటమితో భయం భయం..
ఇదే వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ గెలుపు వాకిట్లో బోల్తా పడింది. దానిని పునరావృతం చేయకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడింది. అందువల్లే లక్ష్య చేదనలో ఆచి తూచి ఆడింది. 4.1 ఓవర్ల వరకు పాకిస్తాన్ జట్టు స్కోరు 20 పరుగులు మాత్రమే అంటే.. ఆ జట్టు బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో ఓపెనర్ సహిం ఆయుబ్ (8) ను హెల్జర్ అవుట్ చేసి కెనడా శిబిరంలో ఆనందం నింపాడు. అయినప్పటికీ పాకిస్తాన్ భయపడలేదు. రిజ్వాన్, అజాం జాగ్రత్తగా ఆడారు. ఆరో వికెట్ వరకు ఒక బౌండరీ కూడా లేదంటే.. వారిద్దరి రక్షణాత్మక ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వారిద్దరు దూకుడు పెంచడంతో పాకిస్తాన్ 10 ఓవర్ల తర్వాత ఒక వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఇలానే సమయోచితంగా ఆడుతూ రిజ్వాన్- అజామ్ జోడి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.. ఈ దశలో అజామ్ ను హెలిజర్ అవుట్ చేశాడు. ఫకార్ ను బోర్డాన్ బోల్తా కొట్టించాడు. అప్పటికి పాకిస్తాన్ విజయ సమీకరణం 30 బంతులో 22 పరుగుల కు చేరుకుంది. మరో ఆటగాడు రిజ్వాన్ నిదానంగా ఆడి పని పూర్తి చేశాడు. ఫలితంగా 15 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ విజయం సాధించింది.
అంతకుముందు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కెనడా దూకుడుగా ఆడింది. 2.1 ఓవర్లలో ఏకంగా 20 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ అరోన్ జాన్సన్ తాను ఎదుర్కొన్న రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు. ఈ దూకుడును కెనడా చివరి వరకు కొనసాగించలేకపోయింది. మరో ఓపెనర్ నవనీత్ నాలుగు పరుగులకే అవుట్ కావడంతో.. కెనడాకు కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు పాకిస్తాన్ బౌలర్లు అమీర్, రౌఫ్ మెరుగ్గా బౌలింగ్ వేయడంతో కెనడా కోలుకోలేకపోయింది. ఈ దశలో వికెట్లు కోల్పోవడం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. మువ్వా శ్రేయస్ (2), రవీందర్ పాల్ (0) వంటి ఆటగాళ్లు నిరాశపరచడం, అది కెనడా స్కోర్ మీద ప్రభావం చూపించింది. మరోవైపు జాన్సన్ అర్థ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అతడు నసీం షా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడంతో కెనడా ఆశలు మొత్తం అడుగంటాయి. అప్పటికి ఆ జట్టు ఆరు వికెట్లకు 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో కలీం సన (13*), హెలిజర్(9*) దూకుడుగా ఆడటంతో కెనడా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ విజయంతో గ్రూపులో రెండు పాయింట్లతో పాకిస్తాన్ మూడో స్థానానికి చేరుకుంది. ఆడిన రెండు మ్యాచ్లు గెలిచి అమెరికా రెండవ స్థానంలో ఉంది. పాకిస్తాన్ గ్రూప్ -8 కు వెళ్లాలంటే భారత్ తో జరిగే మ్యాచ్లో అమెరికా చిత్తుగా ఓడిపోవాలి. పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు అమెరికా, పాకిస్తాన్ సమానస్థితిలో ఉంటాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సూపర్ -8 లోకి వెళ్తుంది.