Pak Vs Aus 2nd T20: టి20లలో భారత జట్టు తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపించే జట్టుగా ఆస్ట్రేలియాకు పేరు ఉంది. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు లో అందరూ భీకరమైన ఆటగాళ్లు ఉన్నారు. వారంతా కూడా పెను విధ్వంసాన్ని సృష్టించగలరు. అదే అటువంటి ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం పాక్ ముందు తేలిపోతోంది. ఏమాత్రం ప్రభావం చూపించలేక తలవంచుతోంది.
మూడు టి20 మ్యాచ్ ల సిరీస్లో భాగంగా పాకిస్థాన్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ కూడా కోల్పోయింది. టి20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన ఇలా ఉండడాన్ని సగటు కంగారు అభిమాని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఆ స్థాయిలో ప్లేయర్లు ఉన్నప్పటికీ పాకిస్థాన్ ముందు తలవంచడం పట్ల విస్మయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్ల మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
టి20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. పాకిస్తాన్ జట్టు మ్యాచ్ లను శ్రీలంక వేదికగా ఆడుతుంది. శ్రీలంక మైదానాలు బౌలింగ్ కు సహకరిస్తాయి. ప్రస్తుతం పాకిస్తాన్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్, షాదాబ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు సిరీస్ కోల్పోవడంలో వీరు కీలకపాత్ర పోషించారు. శ్రీలంక మైదానాలపై కూడా వీరికి అద్భుతమైన రికార్డు ఉంది.
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్తాన్ ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా తలపడతాయి. ఆస్ట్రేలియా జట్టుకే షాక్ ఇచ్చిన పాకిస్తాన్ కు ఆటగాళ్లు.. భారత జట్టుపై కూడా అదే స్థాయిలో ప్రదర్శన చేస్తారని పాక్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే గనక జరిగితే టీమిండి అభిమానులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. పాకిస్తాన్, భారత్ మధ్య ఇప్పటివరకు మొత్తం 16 టి20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో భారత్ 13 సార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ మూడుసార్లు గెలుపును అందుకుంది. ఓవరాల్ గా టీమిండియా కు మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ.. గడచిన కొన్ని సంవత్సరాలుగా ఐసిసి నిర్వహించే మేజర్ టోర్నీలలో టీమిండియా విజయం సాధిస్తున్నప్పటికీ.. ఎక్కడో ఒక మూల అనుమానం వేధిస్తోంది.
ఆస్ట్రేలియా జట్టును ఓడించిన పాకిస్తాన్… టీమ్ ఇండియాకి కూడా షాక్ ఇస్తే..ఆ పరిణామాలు సూర్య కుమార్ యాదవ్ సేన మీద వేరే విధంగా ఉంటాయి. ఆ అవకాశం పాకిస్తాన్ జట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అదే జరగాలంటే టీమిండియాలో ప్లేయర్లు సమిష్టి తత్వాన్ని ప్రదర్శించాలి. బ్యాటింగ్ నుంచి మొదలుపెడితే బౌలింగ్ వరకు దుమ్మురేపాలి.
ఇటీవల ఆసియా కప్ లో టీమిండియా పాకిస్తాన్ చేతిలో తడబాటుకు గురైంది. తిలక్ వర్మ నిలబడటంతో పాకిస్తాన్ జట్టు పప్పులు ఉడకలేదు. అలాంటి తప్పును మరోసారి భారత ప్లేయర్లు చేయకూడదు. పాకిస్తాన్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. పాకిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే.. పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కానీ అదే పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఇటీవల అండర్ 19 జట్టు పాకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోతే సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ప్రచారం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.