Faroe Islands whale hunt : సంస్కృతి సంప్రదాయాలకు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ సంప్రదాయానే మన జీవనానికి, మనుగడకు పునాది. అందుకే కులం, మతం తేడా లేకుండా అందరూ సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు ఇలా అనేక రకాల జీవన శైలులు ఇందులో భాగమే అయితే కొన్ని రకాల జీవన శైలులు ఒళ్లు గగ్గురు పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి ప్రాంతం ఫారో ఐలాండ్స్ అచారం ఒకటి. ఇక్కడ వెయ్యేళ్లుగా కొనసాగుతున్న ఒక ప్రాచీన ఆచారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. ఈ సంప్రదాయం పేరుతో ఇటీవలి ఒక రోజులోనే 700కి పైగా పైలట్ వేల్స్ (తిమింగలాలు), వైట్–సైడెడ్ డాల్ఫిన్లను చంపేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయి ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.
వెయ్యేళ్ల సంప్రదాయం..
ఫారో ఐలాండ్స్‌లో ‘గ్రైండడ్రాప్’ అనే సంప్రదాయం చాలా కాలం నుంచి ఉంది. దీని కింద పెద్ద సంఖ్యలో తిమింగలాలు, డాల్ఫిన్లను బోట్లతో తీరానికి తీసుకువస్తారు. తర్వాత వాటిని చంపి మాంసం, నూనెను స్థానికుల ఆహారం కోసం పంచుతారు. స్థానికులు దీనిని తమ సంస్కృతి, ఆహార అవసరాలు, సామూహిక జీవన విధానంలో భాగంగా చూస్తారు. వారి ప్రకారం ఇది స్థిరమైన, అవసరమైన సంప్రదాయం. ఈసారి జరిగిన ఘటనమే చివరి వారంలో ఫారో ఐలాండ్స్‌లో మూడు ప్రత్యేక స్థలాల్లో ఈ హంట్ జరిగింది. ఒక్క రోజులోనే సుమారు 700కి పైగా తిమింగలాలు డాల్ఫిన్లు చంపబడ్డాయి. తీరం రక్తవర్ణంలోకి మారిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా షాక్‌ను కలిగించాయి.
జంతు ప్రేమికుల ఆగ్రహం..
ఈ ఘటనను జంతు హక్కుల సంఘాలు, పర్యావరణవాదులు తీవ్రంగా స్పందించారు. అనవసరమైన, క్రూరమైన హత్యాకాండంగా అభివర్ణిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ‘‘ఇది సంప్రదాయం కాదు, క్రూరత్వం’’ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఆచారం పట్ల అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.
సంప్రదాయం మాటున అనైతికత
ఫారో ఐలాండ్స్ ప్రజలు ఈ సంప్రదాయాన్ని తమ సంస్కృతి, ఆత్మగౌరవంతో ముడిపెట్టి చూస్తున్నారు. ఇది వారి ఆహార భద్రతకు కూడా సంబంధించిన విషయం. అయితే ఆధునిక కాలంలో జంతు సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవుల పట్ల దయ వంటి విలువలు బలంగా మారాయి. తిమింగలాలు, డాల్ఫిన్లు అత్యంత తెలివైన సముద్ర జీవులు. వాటిని ఇలా సామూహికంగా చంపడం మానవతా దృక్పథంతో సరిపోదని ప్రపంచవ్యాప్త భావన ఏర్పడుతోంది.
ఐలాండ్స్ ప్రభుత్వం, స్థానికులు ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని చూస్తున్నా, అంతర్జాతీయ ఒత్తిడి, యువతరం ఆలోచనా విధానం మారుతోంది. భవిష్యత్తులో ఈ ఆచారం ఎలా మారబోతోందనేది చూడాలి. ఈ ఘటన మనల్ని ఒక విషయం గుర్తు చేస్తుంది. మనం ఏ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నా, దాని వెనుక ఉన్న క్రూరత్వం, జంతు హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఇది.
