ODI world cup schedule : వరల్డ్ కప్ షెడ్యూల్ : బీసీసీఐ చిన్నచూపు.. హైదరాబాద్‌కు అన్యాయం..!

ఇక టీమిండియా మ్యాచ్‌ల విషయానికి వస్తే.. ఒక్క హైదరాబాద్‌ మినహా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరిగే అన్ని స్టేడియాల్లో టీమిండియా ఆడుతుంది. టీమిండియా మ్యాచుల కోసం హెచ్‌సీఏ పోరాడాల్సిందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

Written By: NARESH, Updated On : June 27, 2023 3:16 pm
Follow us on

ODI world cup schedule : భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ ఈఏడాది చిరవన జరుగనుంది. ఈమేరకు షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ విడుదల చేసింది. పది దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో మ్యాచ్‌లను దేశంలోని 12 మైదానాల్లో నిర్వహించేలా బీసీసీఐ షెడ్యూల్‌ రూపొందించింది. అయితే ఇందులో భారత క్రికెట్‌ మండలం హైదరాబాద్‌పై వివక్ష చూపింది. ప్రతీ మైదానంలో కనీసం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా హైదరబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో మాత్రమే మూడు మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ మూడూ కూడా క్వాలిఫైయర్‌ టీమ్స్‌తో జరిగేవే కావడం గమనార్హం. అందునా రెండు పాక్‌ ఆడే మ్యాచులు. మరొకటి న్యూజిల్యాండ్‌ ఆడే మ్యాచ్‌. టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా హైదరాబాద్‌లో ఆడడం లేదు. దీనిపై క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్ని మైదానాల్లో నాలుగు మ్యాచ్‌లు..
ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ ప్రకారం చూస్తే ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్, పూణే, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, చెన్నై, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతీ చోటా కనీసం నాలుగు మ్యాచులు జరుగుతున్నాయి. కొన్ని స్టేడియాల్లో అయితే ఐదేసి మ్యాచులు షెడ్యూల్‌ చేశారు. హైదరాబాద్‌లో మాత్రం అతి తక్కువగా మూడు మ్యాచులే ఏర్పాటు చేయడం తెలుగు ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు.

వారం రోజుల్లోనే షెడ్యూల్‌ పూర్తి..
ఇంకో విషయం ఏంటంటే.. టోర్నీ మొదలైన వారం రోజుల్లోనే హైదరాబాద్‌ షెడ్యూల్‌ ముగుస్తుంది. అక్టోబర్‌ 5న ఇంగ్లండ్, న్యూజిల్యాండ్‌తో ఈ టోర్నీ మొదలవుతుంది. ఆ తర్వాత 6వ తేదీన పాకిస్తాన్, క్వాలిఫైయర్‌–1తో హైదరాబాద్‌లో తలపడుతుంది. అనంతరం 9వ తేదీన న్యూజిల్యాండ్, క్వాలిఫైయర్‌–1 జట్లు కూడా ఇక్కడే పోటీ పడతాయి. ఆ తర్వాత 12న మరోసారి పాకిస్తాన్‌ హైదరాబాద్‌కు వస్తుంది. ఇక్కడ క్వాలిఫైయర్‌–2ను ఢీకొంటుంది. ఈ మూడు మ్యాచ్‌లతో వన్డే వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ముగిసిపోతుంది.

చూడగలిగే మ్యాచ్‌లు ఏవి?
వీటిలో ఏమైనా చూడగలిగే మ్యాచ్‌ ఉందా? అంటే.. ఒకవేళ జింబాబ్వే కనుక క్వాలిఫైయర్‌–1 లేదా క్వాలిఫైయర్‌–2గా వస్తే.. పాక్‌తో వారి మ్యాచ్‌ చూడొచ్చు. ఇక పసికూనతో కివీస్‌ మ్యాచ్‌పై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. ఆ మ్యాచ్‌లో 90 శాతం విజయం కివీస్‌దే అని ఫ్యాన్స్‌ నమ్మకం. ఇలాంటి మ్యాచులే హైదరాబాద్‌లో నిర్వహించడంపై తెలుగు క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్ని మైదానాల్లో టీమిండియా మ్యాచ్‌లు..
ఇక టీమిండియా మ్యాచ్‌ల విషయానికి వస్తే.. ఒక్క హైదరాబాద్‌ మినహా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరిగే అన్ని స్టేడియాల్లో టీమిండియా ఆడుతుంది. టీమిండియా మ్యాచుల కోసం హెచ్‌సీఏ పోరాడాల్సిందని ఫ్యాన్స్‌ అంటున్నారు. అయితే ప్రస్తుతం హెచ్‌సీఏ ఉన్న పరిస్థితుల్లో అవేమీ సాధ్యం కాదని కూడా కొందరు అంటున్నారు. ఏదేమైనా హైదరాబాద్‌ క్రికెట్‌ ప్రేమికులకు ఈ వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ రుచించలేదనేది మాత్రం వాస్తవం.