NZ vs SA అప్పుడెప్పుడో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభించిన తొలి సీజన్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తన క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఐసీసీ మేజర్ టోర్నీలో గెలుపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ టోర్నీని కూడా అందుకోలేకపోయింది. 2024 t20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరినప్పటికీ.. భారత్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ దాకా వచ్చినప్పటికీ.. ఊపిరి సలపని ఒత్తిడిలో న్యూజిలాండ్ ముందు చేతులెత్తేసింది..
లాహోర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయింది. ఆ జట్టు ఓడిపోయింది అనడం కంటే ఒత్తిడిలో ఆటగాళ్లు చిత్తయ్యారు అనడం సబబు. ఒత్తిడిలో సరిగ్గా ఆడలేరనే అభిప్రాయాన్ని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మరోసారి నిజం చేసి చూపించారు. రికెల్టన్, క్లాసెన్, మార్క్రం, ముల్డర్ లాంటి ఆటగాళ్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది.. కీలక సమయంలో ఈ ఆటగాళ్లు చేతులెత్తయడంతో మ్యాచ్ పై న్యూజిలాండ్ పట్టు బిగించింది.. మరోవైపు న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ కీలక సమయంలో బవుమా(56), వాన్ డెర్ డసెన్(69) వికెట్లను తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ దశలో మిగతా ఆటగాళ్లు కూడా చేతులెత్తేయడంతో పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ (100) 67 బంతుల్లో శతకం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అతడికి ఇంకొక ఆటగాడు గనుక సహకరించి ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. అతడు వేగంగా ఆడటం వల్ల ఓటమి అంతరం తగ్గింది గాని.. ఓటమిని మాత్రం దక్షిణాఫ్రికా జట్టు తప్పించుకోలేకపోయింది.
న్యూజిలాండ్ వీరవిహారం
అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108), విలియంసన్ (102) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 164 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన ఫిలిప్స్ (49), మిచెల్(49) దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్ గిడి మూడు, రబాడ రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 363 పరుగుల విజయ లక్ష్యం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు మొదట్లో ఎదురుదాడికి దిగినట్టు కనిపించింది. కానీ ఎప్పుడైతే బవుమా, వాన్ డెర్ డసెన్ వికెట్లు కోల్పోయిందో.. అప్పటినుంచి ఒత్తిడిలో కూరుకుపోయింది. క్లాసెన్ లాంటి ఆటగాడు మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది. అయితే చివర్లో మిల్లర్ (100) 67 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా నిలిచాడు. అతడికి మరో ఆటగాడు గనుక తోడై ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. మిల్లర్ సూపర్ సెంచరీ చేసినప్పటికీ దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. మిల్లర్ దూకుడుగా ఆడటం వల్ల దక్షిణాఫ్రికాకు ఓటమి అంతరం మాత్రమే తప్పింది. 50 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. మొత్తంగా న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా మీద 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.. ఈ గెలుపు ద్వారా 2023 వన్డే వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఇప్పటికే టీమ్ ఇండియా ఫైనల్ వెళ్ళింది. దక్షిణాఫ్రికా మీద గెలిచి న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆదివారం ఫైనల్లో భారత జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది.