Nitish Kumar Reddy : క్రికెటర్ కావడానికి చాలా కష్టపడ్డాడు. రాత్రింబవళ్లు మైదానానికి మాత్రమే పరిమితమయ్యాడు. అతని కోసం తండ్రి తన విలువైన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. చివరికి ఆర్దిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఇవన్నీ సానుభూతి పెంచడానికి మాత్రమే పనికొస్తాయి. అతనిపై పాజిటివిటీ కలగడానికి మాత్రమే ఉపకరిస్తాయి. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే.. అంతిమంగా అద్భుతమైన ఆట తీరుతోనే ఆకట్టుకోవాలి. ఆ ఆట ద్వారానే అందరి మనసుల్లో స్థానం సంపాదించాలి. అప్పుడే ఒక ఆటగాడికి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఇక అలా ఆడిన ఆటగాడికి జట్టులో స్థానమే కాదు.. సముచిత ప్రాధాన్యం కూడా లభిస్తుంది. కాకపోతే ఈ విషయాలను తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మర్చిపోయినట్టు కనిపిస్తోంది.
Also Read : ముంబై వదిలించుకున్న శనిని హైదరాబాద్ 11.25 కోట్లకు కొని అనుభవిస్తోంది..
గత సీజన్లో
గత సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి మైదానంలో మెరుపులు మెరిపించాడు. ఉత్తేజ కరమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో అతడిని హైదరాబాద్ జట్టు యజమాని కావ్య రిటైన్ చేసుకుంది. జట్టుకు ఉపయోగపడతాడని.. భారీగా పరుగులు చేస్తాడని ఆశలు పెట్టుకుంది. కానీ అతను మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. బంతిని కొట్టడం కాకుండా.. బంతులను మింగడంలో పోటీ పడుతున్నాడు. టి20 లో టెస్ట్ తరహా బ్యాటింగ్ చేస్తూ పరువు తీసుకుంటున్నాడు. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడింది. ఇందులో నితీష్ కుమార్ రెడ్డి ఆరు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. అతడి మొత్తం స్కోరు 131 పరుగులు అంటే.. బ్యాటింగ్ ఎంత దారుణంగా చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.. గడచిన ఆరు ఇన్నింగ్స్లలో అతడు 31, 32, 0, 19, 31, 19 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం అతడి బ్యాటింగ్లోని బేలతనాన్ని చూపిస్తోంది. వాస్తవానికి ఇలాంటి ఆటగాడికి హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ ఎలా వరుస అవకాశాలు ఇస్తుందోనని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ” తెలుగువాడని విపరీతమైన హైప్ ఇచ్చారు. కానీ అతడేమో దారుణంగా విఫలమవుతున్నాడు. ఏమాత్రం తనదైన ఇన్నింగ్స్ ఆడ లేక చతికిల పడుతున్నాడు. పరుగుల సంగతి ఏమోగాని.. బంతులను దారుణంగా మిగుతున్నాడు. ఫలితంగా ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా చూపిస్తోంది. అయితే నితీష్ కనుక ఇలానే ఆడితే తదుపరి మ్యాచ్లలో అతనికి చోటు కూడా లభించకపోవచ్చు. ఇప్పటికైనా అతడు తన ఆట తీరు మార్చుకోవాలి. అటాకింగ్ గేమ్ నేర్చుకోవాలి. లేకపోతే అంతే సంగతులని” క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.. ఇక ముంబైలో జరిగిన మ్యాచ్లో నితీష్ అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేసి నిరాశ కలిగించాడు. కేవలం ఒకే ఒక ఫోర్ కొట్టి.. తనలో ఉన్న వైఫల్యాన్ని ప్రదర్శించుకున్నాడు. మరి దీనిని నితీష్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.
Also Read : ముంబై పై ఓడిపోయినా.. SRH కు ప్లే ఆఫ్ అవకాశం.. దానికోసం ఏం చేయాలంటే?