NZ Vs WI 3rd Test Day 1: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్ మంగనుయి లోని బే ఓవల్ మైదానంలో మూడో టెస్ట్ ఆడుతోంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది..
న్యూజిలాండ్ ఓపెనర్లు లాతం (75), కాన్వే(96) అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు తొలి వికెట్ కు 174 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పిచ్ పై ఉన్న తేమను వినియోగించుకోవడంలో వెస్టిండీస్ బౌలర్లు విఫలమవుతున్నారు. కేమన్ రోచ్, సీల్స్, ఫిలిప్, గ్రీవ్స్, చేజ్… ఇలా ఐదుగురు బౌలర్లను వెస్టిండీస్ జట్టు ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
వెస్టిండీస్ జట్టు ఇప్పటికే రెండో టెస్ట్ ఓటమిపాలైంది. తొలి టెస్ట్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి డ్రా చేసుకుంది. రెండో టెస్టులో మాత్రం ఆ స్థాయిలో ఆట తీరు కనబరచలేకపోయింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మూడో టెస్టులో కూడా పర్యాటక జట్టు ఏమాత్రం సత్తా చూపించడం లేదు. దారుణమైన బౌలింగ్తో నిరాశ పరుస్తుంది. తొలి టెస్ట్ లో దుమ్మురేపిన వెస్టిండీస్ బౌలర్లు.. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నారు.
ఇప్పటికే న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్, టి20 సిరీస్ లను వెస్టిండీస్ కోల్పోయింది. సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. సమిష్టి ప్రదర్శన చేయడంలో వెస్టిండీస్ ప్లేయర్లు విఫలమవుతున్నారు. దీంతో పర్యాటక జట్టుకు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓటములు ఎదుర్కొన్న వెస్టిండీస్.. అర్ధాంతరంగా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వెస్టిండీస్ లెజెండ్ ప్లేయర్లు హాజరయ్యారు. వారంతా విలువైన సూచనలు ఇచ్చారు. ఇకపై వెస్టిండీస్ జట్టు క్రికెట్ మారుతుందని భరోసా కూడా కల్పించారు. కానీ ఆ మాటలు ఆ సమావేశం వరకే పరిమితమైపోయాయి. ప్లేయర్లు ఎప్పటి మాదిరిగానే నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు.