Women T20 World Cup Final 2024: కివీస్ అమ్మాయిలదే పొట్టి ప్రపంచ కప్… ఫైనల్ లో ఒత్తిడికి తలవంచిన సఫారీలు..

ఇటీవల జరిగిన పురుషుల టి20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఒత్తిడికి తలవంచింది. ఫలితంగా టీమిండియా చేతిలో పరాజయం పాలైంది. మహిళల జట్టు కూడా దుబాయ్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్ళింది. న్యూజిలాండ్ చేతిలో భంగపాటుకు గురైంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 21, 2024 9:12 am

Women T20 World Cup Final 2024

Follow us on

Women T20 World Cup Final 2024: దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలో న్యూజిలాండ్ జట్టు అమ్మాయిలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. పురుషుల జట్టు అందుకోలేని ఘనతను సాధ్యం చేశారు. తమ దేశానికి మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రపంచ అందేలా చేశారు. ఒకే రోజు అటు పురుషుల జట్టు ఇండియా పై చారిత్రాత్మక టెస్ట్ విజయాన్ని సాధిస్తే.. ఇటు మహిళల జట్టు టి20 ప్రపంచ కప్ దక్కించుకొని.. కివీస్ అభిమానులకు డబుల్ ఆనందాన్ని అందించారు. ఫైనల్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది. అమేలీయ కేర్ 38, బ్రూక్ హాలిడే 38, సుజి బెట్స్ 32 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంలబా రెండు వికెట్లు దక్కించుకుంది.. ఆ తర్వాత 159 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్లకు 126 రన్స్ మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో లారా 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. అమేలియా 3/24, రోజ్ మేరీ 3/25 ధాటికి దక్షిణాఫ్రికా జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అమేలియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలను దక్కించుకుంది.

పాపం దక్షిణాఫ్రికా

ఇటువంటి ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా ప్రారంభం నుంచి ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. ఫైనల్ లోనూ చేజింగ్ ను ఘనంగా ప్రారంభించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ వోల్వార్ట్ వరుస బౌండరీలతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఒకానొక దశలో ఆరు ఓవర్లకు వికెట్లేమీ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. విజయం వైపు పరుగులు తీస్తున్న దశలో.. న్యూజిలాండ్ బౌలర్ జోనాస్ అద్భుతం చేసింది. తజ్మీన్(17) వికెట్ పడగొట్టింది. దీంతో 51 రన్స్ తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక అప్పటినుంచి దక్షిణాఫ్రికా పతనం మొదలైంది. అమేలియా ఒకే ఓవర్ లో వోల్వార్ట్, బాష్(9) ను అవుట్ చేయడంతో సఫారీలు ఒత్తిడిలో కూలిపోయారు. స్లో డెలివరీ లతో సఫారీ బ్యాటర్ లను న్యూజిలాండ్ బౌలర్లో బోల్తా కొట్టించారు. వరుస బంతుల్లో మరిజేన్(8) ను కార్సన్, డిక్లెర్క్(6) ను రోజ్ మేరీ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. ఆ తదుపరి లాంచనాన్ని పూర్తి చేయడానికి ఆ న్యూజిలాండ్ జట్టుకు ఎంతో సమయం పట్టలేదు. మొత్తంగా దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా అమ్మాయిలు మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు.