Jagan: చాలా మెట్లు దిగిన జగన్.. షర్మిల తో రాయ’బేరం’!

ఎట్టకేలకు షర్మిలతో జగన్ రాజీ కుదుర్చుకున్నారు. తమ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారు. ఇందుకు బెంగళూరు వేదిక అయింది. కాంగ్రెస్ కీలక నేతలే ఈ చర్చలకు కారణమని తేలింది.

Written By: Dharma, Updated On : October 21, 2024 9:07 am

Jagan And Sharmila

Follow us on

Jagan: జగన్ ఒక మెట్టు దిగి వచ్చారా? సోదరి షర్మిల తో రాజీ కుదుర్చుకున్నారా? వివాదాలన్నీ పరిష్కరించుకున్నారా? ఆస్తుల్లో సమాన వాటా ఇచ్చేందుకు అంగీకరించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బెంగళూరు కేంద్రంగా షర్మిల తో జగన్ రాజీ చర్చలు కుదిరినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. దానికి షర్మిల తీరే కారణం అన్న ఒక విశ్లేషణ ఉంది. షర్మిల జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో ఒక రకమైన భావన జగన్ పై ప్రజల్లో కలిగింది. అదే తీరని నష్టానికి గురిచేసిందని తెలుస్తోంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా.. షర్మిల జగన్ పైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇది మరింత నష్టానికి గురి చేయడం ఖాయమని జగన్ భావిస్తున్నారు. షర్మిల తో సంధి చేసుకోవడమే మేలని సన్నిహితులు చెప్పడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. అందుకే షర్మిలతో చర్చలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి కొందరు కాంగ్రెస్ పెద్దలే సారధ్యం వహించినట్లు సమాచారం. వారి చొరవతోనే ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

* ఇండియా కూటమిలోకి జగన్
జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో చేరాల్సిన అనివార్య పరిస్థితి జగన్ పై ఏర్పడింది. మొన్నటి వరకు జగన్ విషయంలో బిజెపి సానుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేంద్రంలో చంద్రబాబు ప్రాధాన్యత పెరిగింది. చంద్రబాబు సైతం కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. ఈ తరుణంలో బిజెపి తనకు సహకరించే ఛాన్స్ లేదని జగన్ ఒక అంచనాకు వచ్చారు. అందుకే జాతీయస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు వెళ్లాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దీనికి షర్మిల అడ్డంకి అవుతారని భావిస్తున్నారు. అందుకే ఆమె నుంచి ఇబ్బందులు తొలగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆస్తుల వివాదం పరిష్కరించుకున్నట్లు సమాచారం.

* రాజశేఖర్ రెడ్డి ఆశ అదే
వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో తన ఆస్తి ఇద్దరు పిల్లలకు సమానమని చాలా సందర్భాల్లో సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారు. అయితే జగన్ అందుకు అంగీకరించలేదు. తన రాజకీయ ఉన్నతి కోసం పాటుపడిన షర్మిలకు ఎటువంటి పదవులు ఇవ్వలేదు. అధికారంలోకి రాకమునుపు షర్మిల అన్ని తానై వ్యవహరించారు. అధికారంలోకి వచ్చాక అదే షర్మిలను పక్కన పెట్టారు జగన్. అందుకే షర్మిల తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ అజెండాను ఎంచుకున్నారు.అదే సమయంలో జగన్ పై యుద్ధం ప్రకటించారు. దాని పర్యవసానాలు ఇప్పుడు జగన్ కు తెలిసి వచ్చాయి. షర్మిల తో శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదని.. అటు కాంగ్రెస్ తో సహయోజకు షర్మిల అడ్డు కాకూడదని జగన్ భావించారు. అందుకే షర్మిల తో సమస్యలను పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే జగన్ ఒక మెట్టు దిగారు అన్నమాట