Gautam Gambhir Latest News: క్రికెట్ ఆస్ట్రేలియాలో ప్లేయర్ల ఎంపిక మొత్తం ప్రతిభ ఆధారంగానే కొనసాగుతుంది.. పెద్దగా సామర్థ్యాన్ని చూపించని ఆటగాళ్లకు ఏ మాత్రం అవకాశం ఉండదు. వారు డొమెస్టిక్ క్రికెట్లో తమను తాము నిరూపించుకుంటేనే జాతీయ జట్టులోకి అవకాశం లభిస్తుంది. ఎంత పెద్ద తోపు ప్లేయర్లు అయినా సరే ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. అందువల్లే దశాబ్దాల పాటుగా ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని ఆస్ట్రేలియా జట్టు శాసిస్తోంది. జట్టు మాత్రమే శాశ్వతం.. ఆటగాళ్లు తాత్కాలికం అనే సిద్ధాంతాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఎప్పటికి పాటిస్తూ ఉంటుంది. అందువల్లే ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తూ సరికొత్త చరిత్రను సృష్టిస్తూ ఉంది.
టీమిండియా కు అదేం దరిద్రం అర్థం కావడం లేదు. మెరుగైన జట్టుంది. అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. ఏదైనా సమకూర్చ గలిగే మేనేజ్మెంట్ ఉంది. అయినప్పటికీ ఏదో ఒక లోపం టీమిండియాను ప్రస్తుతం వెంటాడుతూనే ఉంది. తాజాగా టీం ఇండియాను వెంటాడుతున్న ఆ లోపం పేరు గౌతమ్ గంభీర్. ఆటగాడిగా.. శిక్షకుడిగా అందరికీ మంచి పేరు ఉంది. కానీ టీమ్ ఇండియాకు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. శిక్షకుడి కంటే రివెంజ్ తీర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాడు. వాస్తవానికి జట్టులో మెరుగైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. వారిని తీసుకోవడం లేదు. అంతంత మాత్రం ప్రతిభ ఉన్న వారిని జట్టులోకి తీసుకొని గెలుపులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడు.
ఇటీవల ఆసియా కప్ జరిగినప్పుడు గిల్ కు అనవసరంగా అవకాశం ఇచ్చాడు. అది అభిషేక్ శర్మ పై విపరీతమైన ఒత్తిడి పడేలా చేసింది. అంతేకాదు బుమ్రాను జట్టులోకి ఎందుకు తీసుకున్నాడో కూడా అంతు పట్టలేదు. వాస్తవానికి యశస్వి జైస్వాల్ ను ఎందుకు దూరం పెట్టాడో, అయ్యర్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదో ఇప్పటికీ గౌతమ్ గంభీర్ సమాధానం చెప్పలేడు. ఎందుకంటే వారిద్దరూ బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. అయినప్పటికీ వారిని దూరం పెట్టాడు.. ఇప్పుడిక ఏకంగా రోహిత్ శర్మనే సారథ్యం నుంచి పక్కకు తప్పించాడు. సాధారణ ఆటగాడిగా పరిమితం చేశాడు.
వాస్తవానికి రోహిత్ శర్మ అనుభవం జట్టుకు చాలా అవసరం. పైగా అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తన బరువును కూడా తగ్గించుకున్నాడు. మైదానంలో అత్యంత చలాకీగా తిరుగుతున్నాడు. మేనేజ్మెంట్ ఆదేశాలను విరాట్ కోహ్లీ పాటించకపోయినప్పటికీ.. రోహిత్ మాత్రం తలవంచుకొని మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తున్నాడు. అయినప్పటికీ గంభీర్ మనసు మారలేదు. మారే అవకాశం కూడా లేదు. కేవలం గిల్ మీద అంతటి నమ్మకం పెట్టుకున్న అతడు.. ఏదో ఒక రోజు జట్టును కుప్పకూల్చడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.