Iyer better than Gill: ఇటీవల ఆసియా కప్ లో గిల్ దారుణంగా నిరాశపరచాడు. బీభత్సమైన ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ ను పక్కన పెట్టి మరీ గిల్ కు అవకాశం ఇచ్చాడు గౌతమ్ గంభీర్. ఒకే ఒక ఇన్నింగ్స్ మినహా.. అన్నింట్లోనూ గిల్ విఫలమయ్యాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో సింగిల్ డిజిట్ స్కోర్ కు అవుట్ అయ్యాడు.
వాస్తవానికి గిల్ ను టి20 జట్టులోకి ఎందుకు తీసుకున్నారు ఇప్పటికీ గౌతమ్ గంభీర్ వద్ద సమాధానం లేదు. టెస్ట్ జట్టులోకి తీసుకుంటే.. తనను తాను నిరూపించుకున్నాడు గిల్. సారధిగా కూడా ఓకే అనిపించుకున్నాడు. కానీ టి20 లో మాత్రం అతడు విఫలమయ్యాడు. గౌతమ్ గంభీర్ ప్రయోగం అక్కడితోనే ఆగలేదు.. ఏకంగా వన్డే జట్టులో కూడా మార్పులు చేసే దిశగా అడుగులు వేయించింది. టీమిండియాలో అత్యంత విజయవంతమైన సారధిగా ఉన్న రోహిత్ శర్మను పక్కనపెట్టి గిల్ కు అవకాశం ఇచ్చాడు అంటే గౌతమ్ గంభీర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అటువంటి ఆటగాడిని ఆసియా కప్ కు దూరం చేశాడు గౌతమ్ గంభీర్. అంతేకాదు ఇంగ్లాండ్ సిరీస్ కు కూడా దూరం పెట్టాడు. దీంతో గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇచ్చాడు గౌతమ్ గంభీర్.
శ్రేయస్ అయ్యర్ ఐపిఎల్ లో కోల్ కతా ను విజేతగా నిలపాడు. ఈ సీజన్లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఒత్తిడిలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తాడు. జట్టుకు ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడతాడు. అయితే అటువంటి అయ్యర్ ను ఉప సారధిగా చేయడం పట్ల గౌతమ్ గంభీర్ మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి గిల్ కంటే శ్రేయస్ అయ్యర్ మెరుగైన ఆటగాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడికి స్థానంతో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేయడం వచ్చు. కానీ అవకాశాలే రావడం లేదు. ఎంతోమంది విమర్శిస్తే తప్ప శ్రేయస్ అయ్యర్ విలువ గౌతమ్ గంభీర్ కు తెలిసి రాలేదు. ఇప్పుడు తెలిసి వచ్చినా సరైన స్థానం కల్పించలేదు. గౌతమ్ గంభీర్ అయ్యర్ మీద ఇలా ఎంతకాలం పగ సాధిస్తాడో చూడాల్సి ఉంది.