Gongadi Trisha: ఎక్కడో భద్రాచలంలో పుట్టిన ఆమె.. అంచలంచలుగా ఎదిగింది. తనకి ఇష్టమైన క్రికెట్లో రాణిస్తోంది.. బ్యాటింగ్, బౌలింగ్ లో చిచ్చరపిడుగు మాదిరిగా ప్రదర్శన చేస్తోంది. అందువల్లే టీమిండియా ఇటీవల జరిగిన అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును తీవ్రమైన ఒత్తిడిలో పడేసి.. విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో త్రిష అద్భుతమైన పాత్ర పోషించింది. స్కాట్లాండ్ జట్టు పైన సెంచరీ.. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 40 కి పైగా పరుగులు, మూడు వికెట్లు పడగొట్టి ఆదరగొట్టింది. ఆమె అద్భుతమైన ప్రదర్శన ముందు దక్షిణాఫ్రికా జట్టు నిలబడలేకపోయింది. కనీసం పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో టీమ్ ఇండియా వరుసగా అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. బలమైన ఆస్ట్రేలియా వల్ల కానిది, దుర్భేద్యమైన న్యూజిలాండ్ జట్టు వల్ల కానిది, పటిష్టమైన వెస్టిండీస్ జట్టు వల్ల కానిది.. టీమిండియా సొంతమైంది. టీమిండియా ఆ స్థాయిలో ఆట తీరును ప్రదర్శించడం వెనుక త్రిష ఉన్నది. అందువల్లే ఆమె పేరు అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో మారు మోగిపోతున్నది.
రోహిత్ మాదిరిగానే
ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన తర్వాత ట్రోఫీని పట్టుకొని త్రిష అలా మైదానంలో పడుకుని పోయింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత ఏడాది దక్షిణాఫ్రికా జట్టు పై టి20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీని పట్టుకొని అలానే మైదానం మీద పడుకొని పోయాడు. జీవితకాల సాఫల్య విజయాన్ని దక్కించుకున్నంత ఆనందాన్ని ప్రదర్శించాడు. తన రెండు చేతుల్లో ఆట్రోఫీని పట్టుకొని.. కళ్ళు మూసుకొని చాలాసేపు పడుకుని ఉండిపోయాడు. ఇప్పుడు త్రిష కూడా అలానే చేసింది. అలాంటి హావభావాలనే ప్రదర్శించింది.. త్రిష, రోహిత్ శర్మ ఫోటోలను జత చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. “ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు. ఒకరు కెప్టెన్ గా, ఇంకొకరు ఆల్ రౌండర్ గా టీం ఇండియా విజయాలలో కీలకపాత్ర పోషించారు. రోహిత్ శర్మ టి20కి వీడ్కోలు పలికాడు. త్రిష మాత్రం ఇంకా టీనేజ్ లోనే ఉంది. ఆమె ఆధ్వర్యంలో టీమిండియా మహిళల జట్టు అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. ఆమె ఇదే ఊపు కొనసాగిస్తే టీమిండియాలో మరో మిథాలీ రాజ్ అవుతుంది. ఆమె అద్భుతమైన దూకుడు సరి కొత్తగా కనిపిస్తోంది. ఆమె బౌలింగ్ వైవిధ్యంగా ఉంది. ఇలాంటి ప్లేయర్లు టీమిండియా కు చాలా అవసరం. ఇలాంటివారిని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది.. ఎక్కడో మారుమూల భద్రాచలంలో పుట్టిన ఆమె ఇవాళ ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.