Sipai Subrahmanyam: ఏపీలో ఒక ఎమ్మెల్సీ కిడ్నాప్ నకు గురయ్యారని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తిరుపతికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతిలో ఆయన ప్రముఖ వైద్యుడు కూడా. కొద్దిరోజుల కిందట జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు సంబంధించి ఆయన ఎక్స్ అఫీషియో సభ్యుడు. నిన్న ఉప ఎన్నికకు సంబంధించి కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఈ తరుణంలో సోమవారం రాత్రి ఎమ్మెల్సీ డాక్టర్ సుబ్రహ్మణ్యం కిడ్నాప్ నకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి నగరంలో కలకలం రేపుతోంది. ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలను సృష్టిస్తోంది.
* ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకం
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికను కూటమితో పాటు వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీకి ఇక్కడ స్పష్టమైన బలం ఉంది. కానీ ఎన్నికలకు ముందు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. చాలామంది కార్పొరేటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. అదే సమయంలో వైసీపీ సైతం తన బలాన్ని నిలుపుకునే ప్రయత్నం చేసింది. ఈ తరుణంలో ఇక్కడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నిన్న వారం లేకపోవడంతో ఈరోజుకు ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం కూటమి బలం 22 మంది మాత్రమే. డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలంటే ఈ సంఖ్య చాలదు. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు కార్పొరేటర్ లను కూటమి బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ కనిపించకపోవడం వెనుక కూటమి పార్టీల హస్తం ఉందని వైసిపి ఆరోపిస్తోంది. తిరుపతి కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకే ఈ ఎత్తుగడవేశారని అనుమానిస్తోంది.
* ఓ యువనేత సూత్రధారి
ప్రధానంగా ఓ యువనేత ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. క్రీడలకు సంబంధించి నామినేటెడ్ పోస్ట్ దక్కించుకున్న ఓ నేత చిత్తూరు జిల్లాలో తన హవాను చాటుకుంటున్నారు. ఆయనకే కూటమి అభ్యర్థి గెలుపు బాధ్యత అప్పగించారని.. సదరు నేత దగ్గరుండి ఎమ్మెల్సీ ని కిడ్నాప్ చేయించారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే దీనిపై వైసీపీ విమర్శలకు దిగింది. పది నెలల కాలం ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని తప్పుపడుతోంది. నిన్న రోజంతా తిరుపతిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాత్రికి వైసీపీ ఎమ్మెల్సీ కనిపించకపోవడంతో కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ ఆందోళనతో ఉంది. వ్యవస్థలు సైతం వారికి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తోంది.
* అదే పట్టులో వైసిపి
తిరుపతి కార్పొరేషన్ విషయంలో వైసీపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో పట్టు వదలకూడదని భావిస్తోంది. అందుకే కూటమి సర్కార్ పై నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. తిరుపతిలో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేశారని మాజీమంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. విధ్వంసం సృష్టించి ఆధిపత్యం చూపాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. కూటమి పార్టీల వ్యవహార శైలి సరికాదని.. దీనికి వ్యవస్థలు అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. మొత్తానికైతే ఓ వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.