Homeక్రీడలుక్రికెట్‌Champions Trophy 2024 : రాసి పెట్టుకోండి..పాక్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు..

Champions Trophy 2024 : రాసి పెట్టుకోండి..పాక్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు..

Champions Trophy 2024 : పాకిస్తాన్లో ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు పర్యటిస్తోంది. మూడు టెస్టులు ఆడేందుకు ఆ జట్టు ఇటీవల పాకిస్తాన్ వచ్చింది. అక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా తొలి టెస్ట్ మొదలైంది. ఈ టెస్ట్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ దేశంలో ఉగ్రదాడి జరిగింది. ఆదివారం రాత్రి కరాచీ విమానాశ్రయం బయట భారీ పేలుడు చోటుచేసుకుంది.. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఆ పేలుడు ధాటికి విమానాశ్రయంలోని పలుభవనాలు కంపించాయి.. ఈ బాంబు పేలుడు ఘటన తర్వాత పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించకూడదని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. దీనికోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే కరాచీ వంటి పెద్ద నగరంలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం.. పాకిస్తాన్ లో భద్రతా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ పేలుడు తర్వాత పాకిస్తాన్ దేశం నుంచి ఇంగ్లాండ్ జట్టు అర్ధాంతరంగా బయటికి రావాలని అభిమానులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో పాకిస్తాన్లో అనేకసార్లు పేలుడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో విదేశీ జట్లకు సంబంధించిన ఆటగాళ్ల భద్రత ఎప్పటికీ ఇబ్బందిగానే ఉంటుంది.. విదేశీ ఆటగాళ్లపై దాడులు జరగడంతో చాలా సంవత్సరాల పాటు పాకిస్తాన్లోని క్రికెట్ మైదానాలు నిర్మానుష్యంగా మారాయి. చివరికి పాకిస్తాన్ జట్టు ఇంకా గత్యంతరం లేక యూఏఈ వేదికగా హోమ్ మ్యాచ్ లు ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది.

2009లో..

2009లో లాహోర్ లోని గడాఫీ స్టేడియం బయట శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సు పై దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో పలువురు శ్రీలంక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటన క్రికెట్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఫలితంగా పాకిస్తాన్ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ ను నిలిపివేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2015లో జింబాబ్వే జట్టు పాకిస్తాన్లో పర్యటించింది.. 2009 తర్వాత పాకిస్థాన్లో పర్యటించిన తొలి జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది. అనంతరం బంగ్లాదేశ్ మహిళల జట్టు 2017లో పాకిస్థాన్ లో పర్యటించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, ల్యూక్ లాంటి ఆటగాళ్లు ప్రాణ భయంతో పాకిస్తాన్ లో ఆడేందుకు నిరాకరించారు.. అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో బాంబు పేలుడు చోటు చేసుకోవడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో..”రాసి పెట్టుకోండి పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version