Netherlands vs South Africa : 20 పరుగుల కే నాలుగు వికెట్లు.. అందులో ఇద్దరు గోల్డెన్ డక్.. చేయాల్సిన స్కోర్ స్వల్పమే అయినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని చేదిస్తుందా అనేది డౌటు.. ఈ ఉపోద్ఘాతమంతా ఏదో అనామక జట్టు గురించి అనుకుంటే పొరపాటే.. ఇంతకీ ఆ జట్టు ఏదో.. దాని ప్రత్యర్థి జట్టు కథా కమామీసు ఏంటో.. ఈ కథనంలో తెలుసుకుందాం..
టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ వేదికగా శనివారం సాయంత్రం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో నెదర్లాండ్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైందేనని దక్షిణాఫ్రికా బౌలర్లు నిరూపించారు. నెదర్లాండ్ జట్టుకు ఏ దశలోనూ ఎదురుదాడి చేసేందుకు అవకాశం ఇవ్వకుండా 103 పరుగుల వద్దే ఆగిపోయేలా చేశారు.
నెదర్లాండ్ జట్టులో సి బ్రాండ్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి నెదర్లాండ్ జట్టులో ఓపెనర్ మైకేల్ లేవిట్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఒద్వాడ్ రెండు పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. భారత మూలాలు ఉన్న ఆటగాడు విక్రమ్ జీత్ సింగ్ 12 పరుగులు చేసి పర్వాలేదనిపించినప్పటికీ.. మార్కో జాన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో సీ బ్రాండ్ దక్షిణాఫ్రికా బౌలర్లను ధైర్యంగా కాచుకున్నాడు. 45 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 40 పరుగులు చేసి త్రుటిలో అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బాస్ డీ లీడే(6), ఎడ్వర్డ్స్ (10), తెలుగు కుర్రాడు తేజా నిడమానూరు (0), టింప్రింగిల్ (0) పూర్తిగా నిరాశపరిచారు.. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్ 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో బార్ట్ మాన్ నాలుగు, మార్కో జాన్సన్ రెండు, నోర్ట్ జే రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 104 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ప్రారంభంలోనే తడబాటుకు గురైంది. స్వల్ప స్కోరే అయినప్పటికీ.. నెదర్లాండ్ బౌలర్లు మైదానంపై ఉన్న పచ్చికను, తేమను సద్వినియోగం చేసుకుంటూ బుల్లెట్ లాంటి బంతులు సంధించడం మొదలుపెట్టడంతో నిలబడలేక పోతోంది. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వెంట వెంటనే వికెట్లను సమర్పించుకున్నారు.. ఓపెనర్ రిచాన్రిక్స్ మూడు పరుగులకే వాన్ బీక్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రమాదకరమైన క్వింటన్ డికాక్ 0 పరుగులకే రన్ అవుట్ గా వెనుతిరిగాడు.. దూకుడుకు మారుపేరైన మార్క్రం కూడా పరుగులు ఏమీ చేయకుండానే కింగ్మా బౌలింగ్ లో 0 పరుగులకు పెవిలియన్ చేరుకున్నాడు. మరో ఆటగాడు క్లాసెన్ కేవలం నాలుగు పరుగులు చేసి కింగ్మా బౌలింగ్లో ప్రింగిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
కడపటి వార్తలు అందే సమయానికి 6.5 ఓవర్లలో.. నాలుగు వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది. నెదర్లాండ్ బౌలర్ల ధాటికి మార్క్రం, క్వింటన్ డికాక్ గోల్డెన్ డక్ గా వెనుతిరి గారు. ప్రస్తుతం క్రీజ్ లో డేవిడ్ మిల్లర్ నాలుగు, స్టబ్స్ ఏడు పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.