India vs Pakistan : టి20 వరల్డ్ కప్ లో ప్రారంభ మ్యాక్ లోనే పాకిస్తాన్ ఓడిపోయింది. అమెరికా చేతిలో దారుణమైన ఓటమిని మూటగట్టుకొని పరువు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూయార్క్ వేదికగా భారత జట్టుతో మరో కీలక మ్యాచ్ ఆడనుంది. అమెరికా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని.. ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జట్టుకు.. ఈ మ్యాచ్లో గెలవడం అనివార్యం. టి20 టోర్నీలో కొనసాగాలంటే పాకిస్తాన్ కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి..
భారత జట్టుతో జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే.. ఎలాంటి లెక్కలతో సంబంధం లేకుండా పాకిస్తాన్ నేరుగా సూపర్ -8 లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓటమిపాలైతే అమెరికా మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే భారత జట్టును ఓడించి, సూపర్ -8 కు వెళ్లాలని పాకిస్తాన్ భావిస్తోంది.. ఇందులో భాగంగానే అమెరికాతో ఉత్పన్నమైన తప్పిదాలను సరి చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది.
ఈ క్రమంలోనే తుది జట్టులో అనేక మార్పులు చేస్తోంది. బలహీనంగా కనిపిస్తున్న బ్యాటింగ్ లైనప్ ను సరి చేస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో బాబర్ అజాం, రిజ్వాన్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. వారిద్దరూ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే భారత జట్టుతో ఆడే మ్యాచ్లో దూకుడుగా ఆడే ఆటగాడిని బరిలోకి దించేందుకు పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. సయిమ్ ఆయుబ్ ఫిట్ గా ఉంటే అతడిని ఓపెనర్ గా దించుతారని తెలుస్తోంది. అతడు గనుక జట్టులో వస్తే బండోడు ఆజాంఖాన్ పై వేటుపడుతుంది. అప్పుడు వికెట్ కీపింగ్ చేసే బాధ్యత రిజ్వాన్ పై ఉంటుంది.
ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో చివరి మ్యాచ్ లో ఆజామ్ ఖాన్ గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. టి20 వరల్డ్ కప్ లో అమెరికాతో జరిగిన మ్యాచ్ లోనూ అదేవిధంగా కొనసాగించాడు.. పైగా అతడిని తీసుకోవడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. భారత్ తో జరిగే మ్యాచ్ కు అతడిని పక్కన పెట్టాలని పాకిస్తాన్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఆజాం ఖాన్ తో పాటు మరో కీలక ఆటగాడు ఇఫ్తికర్ అహ్మద్ కూడా దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. అయితే అతడికి స్పిన్ బౌలింగ్ వేసే సామర్థ్యం ఉండడం.. న్యూయార్క్ మైదానం స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తున్న క్రమంలో.. తుది జట్టులో అతడు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.