IPL 2024 – MI : బ్యాటింగ్ సహకరిస్తున్న మైదానంపై టాస్ గెలిచిన తర్వాత ఎవరైనా బౌలింగ్ ఎంచుకుంటారా? పోనీ సీమర్లకు సహకరించని మైదానంపై పేస్ బౌలర్లతో బౌలింగ్ వేయిస్తారా? ఆదివారం రాత్రి చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై కెప్టెన్ పై నిర్ణయాలే తీసుకున్నాడు. ఫలితంగా చెన్నై జట్టు ఊచకోత కోసింది. 60 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత అసలు సిసలైన ఆటను ముంబై ఆటగాళ్లకు రుచి చూపించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69), శివం దూబె(66) సత్తా చాటడం.. చివర్లో మహేంద్ర సింగ్ ధోని 4 బంతుల్లో 20 పరుగులు చేయడంతో చెన్నై జట్టు 206 పరుగుల స్కోర్ చేసింది..
ఇంతటి భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై జట్టు తొలి వికెట్ కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ (105*), ఇషాన్ కిషన్ (23) మెరుగ్గానే ఆడారు. అయితే ధాటిగా ఆడే క్రమంలో కిషన్ మతీష పతీరణ బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది ముంబై పతనం.. సూర్యకుమార్ (0), హార్దిక్ పాండ్యా (2), టిమ్ డేవిడ్(13), రోమారియో షెఫర్డ్ (1), నబీ(4*) ఇలా వచ్చినవారు వచ్చినట్టే వెళ్లారు. వీరిలో ఒక్క తిలక్ వర్మ (31) మాత్రమే నిలబడగలిగాడు. అతడు కూడా కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఫలితంగా మొబైల్ జట్టు ఓటమిపాలైంది.
ఇక ఈ మ్యాచ్లో ప్రముఖంగా ప్రస్తావించాల్సింది చెన్నై జట్టు బౌలర్ పతీరణ గురించి.. సూర్య కుమార్ యాదవ్ డక్ ఔట్ అయ్యాడు అంటే, తిలక్ వర్మ కీలక సమయంలో పెవిలియన్ చేరాడంటే.. రోమారియో షెఫర్డ్ క్లిష్ట పరిస్థితుల్లో వెనుతిరిగాడంటే దానికి కారణం పతీరణే. మలుపులు తిరిగే బంతులు వేస్తూ.. బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ముంబై జట్టు కీలక బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్ చెన్నై వైపు మొగ్గేలా చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడంటే అతని బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ 63 బంతుల్లో 105 పరుగులు చేసినప్పటికీ మరో ఎండ్ లో ఇతర బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ఓపెనర్ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మాత్రమే అతడికి కొంతలో కొంత సహకరించారు. వీరిద్దరితో ఒక వికెట్ కు( కిషన్) డెబ్బై పరుగులు, మరో వికెట్ కు 60 పరుగులు (తిలక్ వర్మ) జోడించాడు. అయినప్పటికీ ముంబై జట్టుకు ఓటమి తప్పలేదు.. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై జట్టు మూడవ స్థానంలో స్థిరపడింది.