MS Dhoni
MS Dhoni : ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ 18 చాలా రసవత్తరంగా నడుస్తోంది. ఈ సీజన్లో 10జట్లు తలపడుతున్నాయి. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. అసలు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అంటే ముందుగా గుర్తొచ్చేది టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే. ధోనీ ఉంటేనే సీఎస్‌కే అనే భావన ఎన్నో ఏళ్లుగా అభిమానుల్లో నాటుకు పోయింది. అలాగే ఈ టీంకు ఉన్నంత మంది అభిమానులు మరే టీంకు లేరు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ చూస్తుంటే సగటు చెన్నై అభిమానికి కాస్త అసహనం కలుగుతోంది.
Also Read : ధోని 30 రన్స్ చేసినా.. అభిమానుల్లో ఈ ఆవేదన ఏంటి?
బ్యాటింగ్‌లో యాజమాన్యం ధోనీకి పూర్తి స్వేచ్ఛనివ్వగా, యువ ఆటగాళ్లకు తగిన అవకాశాలు రావడం లేదని పలువురు అభిమానులు ప్రత్యక్షంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కీలక సమయాల్లో ధోనీ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్న తీరు జట్టుపై ఒత్తిడి పెంచుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వయసు మీద పడుతుండడంతో శరీరం సహకరించకపోవడంతోనే ఎంఎస్ ధోనీ ఆలస్యంగా బ్యాటింగ్‌కు వస్తున్నారని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేని పరిస్థితి ఉండడంతో మ్యాచ్ పరిస్థితిని బట్టి క్రీజులోకి వస్తున్నారని ఆయన వివరించారు.
ధోనీ బ్యాటింగ్ కెపాసిటీ మీద అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారీ షాట్లతో.. తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన ధోనీ, ఇప్పుడు ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడని వారు భావిస్తున్నారు. యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వకుండా ధోనీ ఎక్కువ బంతులు ఆడుతుండడం జట్టుకు నష్టం చేకూరుస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే, ధోనీ అనుభవం జట్టుకు ఎంతో ముఖ్యమని.. అది కీలక సమయాల్లో అతడి సూచనలు జట్టుకు ఉపయోగపడుతాయని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా, ధోనీ బ్యాటింగ్ విషయంలో అభిమానుల్లో నెలకొన్న ఈ అసహనం సీఎస్‌కే భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Also Read : అదే ధోని విజయ రహస్యం.. సురేష్ రైనా