Kodali Nani
Kodali Nani: మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నాని( Kodali Nani ) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాని హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హుటాహుటిన ప్రత్యేక విమానంలో కొడాలి నానిని ముంబై తరలిస్తుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది. గుండె సంబంధిత పరీక్షలు చేయగా.. మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. తొలుత స్టంట్స్ వెయ్యాలని భావించారు. కానీ ఇప్పుడు సర్జరీ అవసరం అని నిర్ధారణకు వచ్చారు. దీనికి తోడు మూత్రపిండాల సమస్య తీవ్రమైనట్లు తెలుస్తోంది. అందుకే అత్యవసరంగా ప్రత్యేక విమానంలో ముంబాయికి తరలించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నారు. నాని అభిమానులు ఆయన ఆరోగ్యం పై ప్రార్థనలు చేస్తున్నారు. క్షేమంగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
Also Read: కొడాలి నాని కి సీరియస్.. హుటాహుటిన హైదరాబాద్ కు ఫ్యామిలీ!
* గత కొద్దిరోజులుగా అస్వస్థత..
గత కొద్దిరోజులుగా అస్వస్థతో ఉన్నారు కొడాలి నాని. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే తరచూ కొడాలి నాని ఆరోగ్యం పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం గుండె సంబంధిత వ్యాధి తీవ్రమైనట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల కిందట చెకప్ చేసుకున్న ఆయనకు గుండెపోటు అని తేలడంతో ఏఐజి ఆసుపత్రిలోనే( AIG Hospital ) ఉండిపోయారు. అయితే స్టంట్సు కానీ పడి ఉంటే ఇక్కడే చికిత్స చేసి ఉండేవారు. కానీ సర్జరీ చేయాల్సి ఉండడంతో హుటాహుటిన ముంబై తరలించారు. దీనికి తోడు మూత్రపిండాల వ్యాధి వెలుగు చూడడంతో వైద్యులు జాగ్రత్త పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై తరలించేందుకు సిద్ధపడ్డారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి వెంటనే సర్జరీ చేయాలని సూచించారు.
* జగన్మోహన్ రెడ్డి సూచనతో..
అయితే హైదరాబాదులోని కొడాలి నాని కి సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) మాట్లాడిన తర్వాత ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయించాలని నిర్ణయించారు. గతంలో మాజీ మంత్రి విశ్వరూప్ కు సైతం ఇదే తరహా సమస్య వచ్చింది. అప్పట్లో ముంబై ఆసుపత్రిలో సర్జరీ చేయడంతో ఆయన కోలుకున్నారు. కొడాలి నాని కి సైతం అక్కడే వైద్యం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబాయికి కుటుంబ సభ్యులు తరలించారు. బుధవారం నానికి సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది.
* ప్రముఖ వైద్య నిపుణుడితో..
ముంబైలోని నానికి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో( Breach Candy Hospital) గుండెకు సర్జరీ జరగనుంది. గుండె సర్జరీ నిపుణులు డాక్టర్ పాండా నానికి బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, కొనకళ్ళ నారాయణ రఘురాం కృష్ణంరాజులకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. కొడాలి నాని ఆరోగ్యం విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సర్జరీ తర్వాత రెండు నెలలు కొడాలి నాని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా కొడాలి నాని ఆరోగ్యం పై ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.