IPL 2024: తోపుగా బౌలింగ్ చేస్తాడు. తురుము లాగా వికెట్లు తీస్తాడు. దమ్ముంటే అతనిని ఆపండి.. అనే అర్థం వచ్చేలాగా కోల్ కతా యాజమాన్యం మాట్లాడింది. ఐపీఎల్ వేలంలో అతనికి 24 .75 కోట్లు చెల్లించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఆటగాడికి దక్కిన అత్యధిక ధర ఇది. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే స్థాయిలో అతడు ఆడాడు. తొలి మ్యాచ్ లో అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. హైదరాబాద్ తో శనివారం జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ను కోల్ కతా యాజమాన్యం ఐపీఎల్ వేలంలో ఏకంగా 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. స్టార్ బౌలర్ అయిన అతడు ఒక స్పెల్ లో 50 కి మించి పరుగులు ఇచ్చుకున్నాడు. వాస్తవానికి తొలి మూడు ఓవర్లలో అతడు 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆఖరి ఓవర్ లో మాత్రం హెన్రీ క్లాసెన్ దూకుడు ప్రదర్శించడంతో 26 పరుగులు ఇచ్చుకున్నాడు. అతడు వేసిన 19 ఓవర్ లో క్లాసెన్ వరుసగా మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. షెహబాజ్ అహ్మద్ కూడా ఒక సిక్స్ కొట్టాడు. ఇదే క్రమంలో ఒత్తిడి భరించలేక స్టార్క్ వైడ్ వేశాడు. చివరి బంతికి క్లాసెన్ ఒక సింగిల్ తీశాడు. దీంతో మొత్తం ఈ ఓవర్ లో స్టార్క్ 26 పరుగులు ఇచ్చుకున్నాడు.
చివరి ఓవర్లో హర్షిత్ రానా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని వల్లే హైదరాబాద్ జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. లేకుంటే హైదరాబాద్ గెలిచి ఉండేది. హైదరాబాద్ ఓడిపోయింది కాబట్టి స్టార్క్ చేసిన తప్పిదం చీకట్లోకి వెళ్లిపోయింది. లేకుంటే అతడు మరణి విమర్శలు ఎదుర్కొనేవాడు. అతడి వల్లే కోల్ కతా ఓడిపోయిందనే అపప్రదను మోసేవాడు. చివరి ఓవర్ లో .. విజయానికి హైదరాబాద్ దగ్గరగా ఉన్న సమయంలో.. హర్షిత్ రానా బుల్లెట్ లాంటి బంతులు వేశాడు. షెహబాజ్, క్లాసెన్ ను అవుట్ చేసి కోల్ కతా కు సంచలన విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్లో క్లాసెన్ బ్యాట్ తో రెచ్చిపోయాడు. 29 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఈ 63 పరుగులలో 48 పరుగులు సిక్సర్ల ద్వారా రావడం విశేషం. ఈ స్థాయిలో బ్యాటింగ్ చేసిన క్లాసెన్ చివర్లో ఒత్తిడికి గురయ్యాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు చివరి 5 బంతుల్లో ఈడు పరుగులు సాధించలేకపోయింది. గెలుపునకు నాలుగు పరుగుల దూరంలో ఉండిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 రన్స్ చేసింది. రస్సెల్( 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్స్ లతో 64 నాట్ అవుట్) బ్యాట్ తో సునామీ సృష్టించాడు. హైదరాబాద్ జట్టు చేజింగ్ లో 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 204 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలయ్యింది.