Rohit Sharma: In the search of gold.. we lost diamond.. ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న కొటేషన్ ఇది. ఇది ముంబై జట్టు యాజమాన్యానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఆ జట్టు యాజమాన్యం అవివేకమైన నిర్ణయం వల్ల ఎంత అభాసు పాలు కావాలో.. అంతటి స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో మూడింటా ఓడిపోయింది. ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టు ఈ స్థాయిలో ప్రదర్శన చేస్తోందంటే ఎవరూ నమ్మడం లేదు. జట్టు ఆటగాళ్లు ఆడుతున్న తీరును చూస్తే.. ఆడుతోంది ముంబై జట్టేనా అనిపిస్తోంది. బౌలింగ్లో పసలేదు. బ్యాటింగ్లో దమ్ము లేదు. ఫీల్డింగ్లో ఇంట్రెస్ట్ లేదు.. మొత్తానికి ఐపీఎల్ 17 సీజన్లో గెలవాలనే కసి ముంబై జట్టులో లేదు. గత రెండు సీజన్లో ముంబై తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయకపోయినప్పటికీ.. ఈ స్థాయిలో విమర్శలు ఎప్పుడూ ఎదుర్కోలేదు.
ముంబై జట్టుకు కెప్టెన్ మార్పు పెద్ద అవరోధంగా పరిణమించింది. అసలు కెప్టెన్ ఎందుకు మార్చారో ఇప్పటికీ జట్టు యాజమాన్యానికి ఒక క్లారిటీ లేదు. జట్టు అవసరాల దృష్ట్యా కెప్టెన్ ను మార్చామని చెప్పినప్పటికీ.. అసలు ఉద్దేశం వేరే ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ జట్టు ప్రయోజనాల కోసమే అయితే హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తో జట్టు భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో అతడు జట్టు భారాన్ని మోసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇలాంటి క్రమంలో రోహిత్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు.. ముంబై జట్టు యాజమాన్యాన్ని ఏకీపారేస్తున్నారు. ఇలాంటి తలతిక్క నిర్ణయం తీసుకొని ఐపీఎల్ 17వ సీజన్ కప్ ఎలా గెలుస్తారంటూ దెప్పిపొడుస్తున్నారు. అంతేకాదు రోహిత్ అభిమానులు ఏకంగా హార్దిక్ అభిమానులపై దాడులకు కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను పక్కన పెట్టిన ముంబై జట్టు యాజమాన్యానికి కనువిప్పు కలిగించే విధంగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి.
మైక్ హస్సీ ఆస్ట్రేలియా పూర్వపు ఆటగాడు. అతడు చెన్నై జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.. ఇటీవల ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.. రోహిత్ శర్మ ను కెప్టెన్సీ నుంచి ముంబై జట్టు యాజమాన్యం పక్కన పెట్టిన నేపథ్యంలో అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. “రోహిత్ శర్మ అన్ని జట్ల బౌలర్లకు భయమే. అతడి నాయకత్వంలో ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకుంది. ఈసారి ముంబై యాజమాన్యం అతన్ని పక్కన పెట్టింది. ఇది బౌలర్లు పండగ చేసుకోవాల్సిన సమయం. చెన్నై జట్టు ఏ కెప్టెన్ కూ భయపడదు. గత సీజన్లో మేము ట్రోఫీ గెలిచాం. అప్పట్లో మా జట్టును ఫైనల్లో ఓడించే కెప్టెన్ ఉండేవాడు. కానీ ఇప్పుడు అతడు నాయకుడిగా లేడు” అంటూ హస్సీ రోహిత్ శర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.. హస్సీ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ అంటే మినిమం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. వజ్రాన్ని వెతికే క్రమంలో ముంబై జట్టు బంగారాన్ని కోల్పోయిందని.. ఈ సీజన్లో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.