Lok Sabha Elections 2024: మనదేశంలో ఎగ్జిట్ పోల్స్ కు భలే క్రేజ్ ఉంది. ఎగ్జాక్ట్ పోల్స్ తో చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ సరితూగలేదు. 2004 ఎన్నికల్లో వాజ్ పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ దారుణంగా విఫలం చెందాయి. అటు తరువాత చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటువంటి విరుద్ధ ఫలితాలు వచ్చాయి. దీంతో సర్వే సంస్థల క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బతింది. అయినా సరే ప్రజల్లో ఎగ్జిట్ పోల్స్ పట్ల విశ్వాసం తగ్గకపోవడం విశేషం.గత ఎన్నికల్లో ఏపీ విషయానికి వచ్చేసరికి వైసీపీ దే విజయం అని మెజారిటీ సర్వేలు తేల్చి చెప్పాయి. కానీ వైసీపీ ఏకపక్ష విజయం దక్కించుకుంటుందని అంచనా వేయలేకపోయాయి.
గత ఎన్నికలకు సంబంధించి 2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు వైసిపి వైపే మొగ్గు చూపాయి.ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 20 స్థానాలకు దగ్గరలో వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.లోక్సభ స్థానాలకు సంబంధించి వైసీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టిడిపికి నాలుగు నుంచి ఆరు సీట్లు రావచ్చు అని చెప్పింది.ఇక ఆరా మస్తాన్ సర్వేలో వైసీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావచ్చని అంచనా వేసింది.టిడిపికి ఒకటి నుంచి ఐదు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పుకొచ్చింది. టైమ్స్ నౌ తన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి 18 సీట్లు, టిడిపికి ఏడు సీట్లు రావొచ్చని అంచనా వేసింది. న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 13 నుంచి 14 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని..టిడిపికి పది నుంచి 12 సీట్లు దక్కించుకుంటుందని చెప్పుకొచ్చింది.అయితే వాస్తవ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి వచ్చాయని చెప్పవచ్చు. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను.. వైసిపి 22 చోట్ల విజయం సాధించింది. టిడిపి కేవలం మూడు స్థానాలకే పరిమితం అయ్యింది.
ఏపీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గతంలో ఈ విధంగా ఉన్నాయి.133 నుంచి 135 సీట్లు వరకు వైసీపీ సాధించే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సేఫాలజీ స్టడీస్ అంచనా వేసింది. టిడిపికి 37 నుంచి 40 స్థానాలు రావొచ్చని పేర్కొంది. జనసేనకు ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఆరా మస్తాన్ సర్వేలో వైసీపీకి 126 అసెంబ్లీ సీట్లు,టిడిపికి 47, జనసేనకు రెండు స్థానాలు వస్తాయని వెల్లడయ్యింది. ఇక కేకే సర్వేలో వైసీపీకి 130 నుంచి 135, టిడిపికి 30 నుంచి 35, జనసేనకు 10 నుంచి 13 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. మిషన్ చాణక్య సర్వేలో వైసీపీకి 98 స్థానాలు, టిడిపికి 58 స్థానాలు, జనసేనకు ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే సర్వే సంస్థలు అంచనా వేసిన దానికంటే.. వైసీపీకి భారీ విజయం దక్కింది.మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ 151స్థానాల్లో విజయభేరి మోగించింది.టిడిపి 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జనసేన ఒక్క సీటుతో సరిపుచ్చుకుంది. అప్పట్లో కేవలం మూడు నాలుగు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మాత్రమే వాస్తవ ఫలితాలకు దగ్గరగా కనిపించాయి. మిగతా ఏ ఒక్కరు ఓటర్ నాడి పట్టలేకపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాలు ఉన్నాయి.