Team India: నాడు అర్జెంటీనా.. నేడు టీమిండియా.. ఆటపై అభిమానం అంటే ఇలా ఉండాలి..

సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత.. 2024 లో వెస్టిండీస్ - అమెరికా దేశాల వేదికలపై జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా ఆవిర్భవించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై ఏడు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 5, 2024 4:14 pm

Team India

Follow us on

Team India: 2022.. ఖతార్ వేదికగా ఫిఫా ఫుట్ బాల్ కప్ టోర్నీ జరిగింది. హేమాహేమీల్లాంటి జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. చివరికి అర్జెంటీనా, ఫ్రాన్స్ ఫైనల్ చేరుకున్నాయి. హోరా హోరీగా పోరు జరిగింది. మెస్సి మాయాజాలంతో అర్జెంటీనా గెలిచింది. ఫిఫా ఫుట్ బాల్ కప్ ను సొంతం చేసుకుంది. ఇంకేముంది దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి..మెస్సీ ఆధ్వర్యంలోని అర్జెంటీనా క్రీడాకారుల బృందం సగర్వంగా స్వదేశానికి వెళ్ళింది. ట్రోఫీ తో ఆటగాళ్లు అర్జెంటీనా రాజధానిలో విజయ ప్రదర్శన చేశారు. ఓపెన్ టాప్ వాహనంలో ట్రోఫీని చూపుతూ అభిమానులకు అభివాదం చేశారు. దేశం యావత్తు అర్జెంటీనా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికింది. వారి విజయాన్ని గుండెల నిండా ఆస్వాదించింది.

సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత.. 2024 లో వెస్టిండీస్ – అమెరికా దేశాల వేదికలపై జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా ఆవిర్భవించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై ఏడు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం రోహిత్ ఆధ్వర్యంలో క్రీడాకారుల బృందం ఉదయం స్వదేశానికి చేరుకుంది. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ని ఆటగాళ్లు కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. ముంబైలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీనికి విక్టరీ పరేడ్ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు. దాదాపు లక్షలాదిమంది అభిమానులు రోహిత్ సేన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అర్జెంటీనా వరల్డ్ కప్ సాధించినప్పుడు జరిగిన విజయోత్సవ ర్యాలీకి మించి అభిమానులు హాజరయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల మంది దాకా వచ్చారని తెలుస్తుంటే.. అధికారికంగా ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉంటారని సమాచారం.

ఈ స్థాయిలో అభిమానులు రావడంతో టీమిండియా ఆటగాళ్లు ఉప్పొంగిపోయారు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో నాడు 2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ సాధించినప్పుడు వచ్చిన జనాన్ని.. 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు వచ్చిన అభిమానులను పోల్చుతూ.. ఓ ఔత్సాహిక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. లక్షలాదిమంది లైక్ చేశారు. ” మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ ఆటను ఆడతాం. టీవీలో చూస్తూ ఆస్వాదిస్తాం. మైదానంలో మా అభిమాన ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తాం. క్రికెట్ పై మా ప్రేమ వెలకట్టలేనిదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.