UK Elections Results: యూకే ఎన్నికల్లో తెలుగువారి ఓటమి..

తెలుగు సంతతికి చెందిన మరో వ్యక్తి చంద్ర కన్నెగంటి కూడా ఓడిపోయారు. ఈయన కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ సెంట్రల్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్రకు 6,221 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Written By: Raj Shekar, Updated On : July 5, 2024 4:20 pm

UK Elections Results

Follow us on

UK Elections Results: బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీని గద్దె దించి 14 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు కూడా పోటీ చేశారు. అయితే ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. ముఖ్యంగా ఇద్దరు తెలుగు వ్యక్తులు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.

లేబర్‌ పార్టీ నుంచి ఒకరు.. కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి ఒకరు..
ఈ ఎన్నికల్లో ఇద్దరు తెలుగు వ్యక్తులు పోటీ చేశారు. ఒకరు వామపక్ష లేబర్‌ పార్టీ నుంచి పోటీ చేయగా, మరొకరు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా గుర్తింపు ఉన్న ఉదయ్‌ నాగరాజు ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ తరఫున నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ స్థానం నుంచి పోటీ చేశారు. లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ నాగరాజు మాత్రం తాజా ఫలితాల్లో ఓడిపోయారు. ఈ స్థానంలో కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన రిచర్డ్‌ పుల్లర్‌ 19,981 ఓట్లతో విజయం సాధించారు. నాగరాజు 14,567 ఓట్లతో రెండోస్థానానికి పరిమితమయ్యారు. నాగరాజు స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం. ఆయన యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో పాలనాశాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. భారత ప్రధాని పీవీ నర్సింహారావుకు ఈయన బంధువు.

తెలుగు సంతతికి చెందిన మరో వ్యక్తి చంద్ర కన్నెగంటి కూడా ఓడిపోయారు. ఈయన కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ సెంట్రల్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్రకు 6,221 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ లేబర్‌ పార్టీకి చెందిన గారెత్‌ స్నెల్‌ విజయం సాధించారు. చంద్ర సొంత గ్రామం నిజామాబాద్‌ జిల్లా కోటగిరి. చదువు పూర్తయిన తర్వాత లండన్‌లో స్థిరపడ్డారు. జనరల్‌ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగరంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు.