RCB Vs KKR
RCB Vs KKR: ఆడుతోంది బెంగళూరులో.. పైగా సొంత మైదానం, సొంత ప్రేక్షకులు, ఇలా ఎటు చూసుకున్నా బెంగళూరు కే అడ్వాంటేజ్. కానీ జరిగింది వేరు.. విరాట్ కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేసినా..కోల్ కతా బౌలర్లను ఒంటి చేత్తో నిలువరించినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా కోల్ కతా జట్టు ఈ సీజన్లో రెండవ వరుస విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బెంగళూరు జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. బెంగళూరులో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ (59 బంతుల్లో నాలుగు ఫోర్లు, 4 సిక్స్ లు 83) విధ్వంసం సృష్టించాడు. గ్రీన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 33) మ్యాక్స్ వెల్(19 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ తో 28) సత్తా చాటారు. చివర్లో దినేష్ కార్తీక్ (8 బంతుల్లో మూడు సిక్స్ లతో 20) దూకుడుగా ఆడాడు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రానా, రసెల్ రెండు వికెట్లు, సునీల్ నరైన్ ఒక వికెట్ పడగొట్టాడు.
183 పరుగుల విజయ లక్ష్యంతో కోల్ కతా బరిలోకి దిగింది.. 16.5 ఓవర్లలో మూడు వికెట్లకు 186 రన్స్ కొట్టి సులువైన విజయాన్ని దక్కించుకుంది. కోల్ కతా ఆటగాళ్లల్లో వెంకటేష్ అయ్యర్ (30 బంతుల్లో మూడు ఫోర్లు, 4 సిక్స్ లతో 50) సునీల్ నరైన్(22 బంతుల్లో రెండు ఫోర్లు, 5 సిక్స్ లతో 47), ఫిల్ సాల్ట్( 20 బంతుల్లో రెండు ఫోర్లు, 2 సిక్స్ లతో 30) శ్రేయాస్ అయ్యర్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 నాట్ అవుట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
కోల్ కతా ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ రెచ్చిపోయారు. ముఖ్యంగా సునీల్ నరైన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కోల్ కతా బౌలర్ల పై ఎదురుదాడి చేశాడు. సాల్ట్ కూడా ధాటిగా ఆడాడు. పవర్ ప్లే లో కోల్ కతా జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 85 పరుగులు చేసిందంటే ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. హాఫ్ సెంచరీకి దగ్గరైన సునీల్ నరైన్ ను మయాంక్ దగర్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. సాల్ట్ ను విజయ్ కుమార్ వైశాఖ్ అవుట్ చేశాడు.
ఈ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ ఆ ఆనందం బెంగళూరు జట్టుకు ఎంతో సేపు లేదు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడాడు. పది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ ను డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ లో ఉన్న యశ్ దయాళ్ అందుకోలేక నేలపాలు చేశాడు. దీంతో లభించిన జీవధానాన్ని శ్రేయస్ అయ్యర్ సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అతడిని యశ్ అవుట్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివర్లో వచ్చిన రింకూ సింగ్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ భారీ సిక్సర్ కొట్టి కోల్ కతా కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.