టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat kohli) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ఫార్మాట్ కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత వైదొలుగుతానని పేర్కొన్నాడు. టెస్టులు, వన్డేలకు సారథిగా కొనసాగుతానని తెలిపాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతోనూ చర్చించినట్లు తెలిపాడు. గత 8,9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లు ఆడటం, ఐదేళ్లుగా సారథిగా ఉండటంతో వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని తెలిపాడు.
టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్టు ఇటీవల జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని తాజా నిర్ణయంతో తేటతెల్లమైంది. టీ20 కెప్టెన్సీ పదవి నుంచి టీ20 ప్రపంచకప్ తర్వాత వైదొలగనున్నట్టు కోహ్లీ ప్రకటనతో అదే రుజువైంది. యూఏఈ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత నుంచి టీ20లకు కెప్టెన్ గా తప్పుకుంటున్నానని.. ఆటగాడిగా కొనసాగుతానని కోహ్లీ ప్రకటించాడు.
కోహ్లీ ట్విట్ చేస్తూ .. ‘‘ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నా.. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నా.. గంగూలీ, రవిశాస్త్రి, రోహిత్ శర్మతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చా.. పని ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు.
టెస్టు, వన్డేలకు మాత్రమే ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. టీ20లకు కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపిక కావడం లాంఛనమే. ఎందుకంటే అతడు ఇప్పటికే టీ20ల్లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు చాంపియన్ గా నిలిపాడు. దీంతో రోహిత్ కే టీ20 పగ్గాలు అందనున్నాయి.
కోహ్లీ వైదొలిగిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. వన్డేలకు కూడా కోహ్లీ గుడ్ బై చెప్పి టెస్టులకు పరిమితం అవుతాడని అందరూ అనుకున్నా.. కేవలం టీ20ల నుంచి మాత్రమే కోహ్లీ వైదొలగడం గమనార్హం.
https://twitter.com/imVkohli/status/1438478585518456832?s=20