Disha, Chaitra Culprits: ఆడది అర్థరాత్రి తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నాడు గాంధీ మహాత్ముడు. కానీ పట్టపగలు నడిరోడ్డుపై హత్యాచారాలు జరుగుతున్నా చేష్టలుడిగి చూస్తున్న సమాజంలో మనం ఉన్నాం.. ఆడకూతుళ్లను అతి దారుణంగా అత్యాచారాలు చేసి చంపేస్తున్నా ఆపలేని వ్యవస్థలో ఉన్నాం.. అంతా అయిపోయాక పోలీసులను తిట్టడం.. నిందితుల దిష్టిబొమ్మలు కాల్చడం.. ఆందోళన బాటపట్టడం.. వారిని ఎన్ కౌంటర్ లో లేపేసాక సంబరాలు చేసుకోవడం.. ఆ ఆడకూతురి మరణానికి తగిన శాస్తి జరిగిందని మరిచిపోవడం.. ఇదేనా మనం కోరుకుంటున్నది.. ఇదేనా మన సమాజం ఆశిస్తున్నది.. సమాజంలో మృగాళ్ల ఆలోచనలు మారనంతవరకూ ‘ఆడపిల్లల’ బతుకులకు గ్యారెంటీ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత పకడ్బందీగా అమ్మాయిలను చూసుకున్నా.. బయటకు వస్తే చాలు కొన్ని వేల మంది కామ చూపుల మధ్య వారి బతుకులు దినదినగండంగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
నాటి ‘దిశ’ ఘటన చూసినా.. నేటి సైదాబాద్ 6 ఏళ్ల బాలిక ‘చైత్ర’పై దారుణం కాంచినా ఆడపిల్లలను రక్షించడంలో.. కాపాడుకోవడంలో సమాజం దారుణంగా విఫలమవుతోందని చెప్పకతప్పదు. మృగాళ్ల దుష్ట ఆలోచనను చంపకుండా ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా ఇలాంటి ఆగవని అర్థమవుతోంది. మహిళలు, యువతులు, చిన్న పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడంలో సమాజంతోపాటు.. ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే ఇది సఫలం అవుతుంది? లేదంటే ఇలా దుర్మార్గాలు మరెన్నో సమాజం చూడాల్సి వస్తుంది.
ప్రస్తుత సమాజంలో మహిళలను వినోద వస్తువుగా.. ఆటబొమ్మగా ఈ సమాజం చూస్తోంది. మగాళ్ల దృక్కోణం మారనంతవరకు అతివలకు సమాజంలో రక్షణ అనేది ఎండమావే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రామాయణ, మహాభారతాల నుంచి ఇదే కథ. సీతమ్మను రావణా సురుడు చరబట్టి చావుకు దగ్గరయ్యాడు. సీతమ్మను కాపాడడానికి జఠాయువు రావణుడితో పోరాడినట్టు మనం ఆడపిల్లల కోసం ఎందుకు పోరాడడం లేదన్నది ఇక్కడ సమస్య. నాటి నుంచి నేటి వరకు కామాంధుల చావులు కళ్ల చూస్తున్నా కూడా సమాజంలో మృగాళ్ల మనస్తత్వం మాత్రం మారడం లేదు. ఆడపిల్లలను సంరక్షించుకోవడాన్ని తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళల భద్రతలకు నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ దేశంలో అవి సరిపోవట్లేదనే విషయాలు తాజా ఘటనలతో నిరూపితం అవుతున్నాయి..మగవాళ్ల వక్రబుద్ది, వక్రదృష్టి నుంచి మహిళలను రక్షించడానికి ప్రస్తుత చట్టాలు చాలడం లేదని అర్థమవుతోంది.
ముఖ్యంగా యువత రాక్షసులుగా కాకుండా కాపాడుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రథమ కర్తవ్యం. అమ్మాయిలు, మహిళలు, చిన్నపిల్లల పట్ల రాక్షనస్వభావాన్ని సమాజం విడనాడాలి.. వారిపట్ల రాక్షకులుగా మారాల్సిన అవసరం ఉంది. మహిళలను చూసే దృష్టి కోణం మారినప్పుడే వారికి ఈ సమాజంలో రక్షణ కలుగుతుంది.
నాడు దిశ హత్యాచారం జరగగానే పోలీసులు, ప్రభుత్వంపై రాళ్లేసిన ప్రజలు.. ఆ నలుగురు కామాంధుల ఎన్ కౌంటర్ తో పూలు చల్లారు. ఇప్పుడు 6 ఏళ్ల బాలికను చంపిన నిందితుడిని పట్టుకోలేదని పోలీసులను తిట్టిన వారే.. రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న నిందితుడిని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. రెండు ఘటనల్లో అమాయకులైన ఆడపిల్లలు అసువులు బాసారు. వారిని చరపట్టిన కీచకులు నరకానికి పయనమయ్యారు. ఇక అంతా అయిపోయిందని ఎవరు పనుల్లో వారున్నారు. కానీ అయిపోలేదు. ఇప్పుడు మొదలైంది. ఆడపిల్లలకు సరైన భద్రత, రక్షణ కల్పించినప్పుడే ఈ సమాజంలో వారు తిరగగలరు.. మనుగడ సాధించగలరు. అలాంటి మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ సమాజంలో ఆడది స్వేచ్ఛగా సంచరించగలదు.