WTC Final India Squad: కేఎల్ రాహుల్ కు శాపం.. ఆ క్రికెటర్ కు వరంగా మారింది

టెస్ట్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న టీమ్ ఇండియా వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో ఇప్పుడు అనుకోని అవాంతరాలను జట్టుకు తెచ్చి పెట్టినట్టు అయింది.

Written By: BS, Updated On : May 9, 2023 8:44 am

WTC Final India Squad

Follow us on

WTC Final India Squad: టీమిండియా జట్టులో చోటు సంపాదించడం ప్రతి క్రికెటర్ కల. వన్డే, టి20 ఫార్మాట్లో స్థానం లభించడం కంటే టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడాన్ని ఎంతో మంది ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. టెస్టు జట్టులో చోటు కలిగిన ప్లేయర్ ను పరిణితి కలిగిన ఆటగాడిగా భావిస్తుంటారు. అటువంటి గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నాడు ముంబై ఇండియన్స్ ఓపెనర్. ఐపీఎల్ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మకమైన టెస్ట్ ఛాంపియన్షిప్ కు ఎంపికయ్యాడు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్. గాయం కారణంగా కేఎల్ రాహుల్ కు శాపంగా మారగా, ఈ యంగ్ ప్లేయర్ కు వరంగా మారింది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఢీకొట్టడానికి భారత్ – ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాలు తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి. రెండేళ్లకోసారి జరిగే ఫైనల్ ఇది. 2021లో సౌతాంప్టన్ లో జరిగిన లో స్కోర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా జట్టు. ఆ సీజన్ లో ఛాంపియన్ నిలిచింది న్యూజిలాండ్ జట్టు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియా – భారత్ జట్లు ఫైనల్ లో తలపడుతున్నాయి.

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత జట్టు..

ఈ ఏడాది జరుగుతున్న ఫైనల్ లో భారత్ జట్టు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న టీమిండియా ఈ ఏడాది కూడా డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరుకుంది. గతంలో ప్రత్యర్థిగా న్యూజిలాండ్ ఆడితే ఈసారి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ ఏడాది జరిగే డబ్ల్యుటిసి ఫైనల్లో భారత జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. జూన్ ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లండన్ లోని ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు డబ్ల్యుటీసి ఫైనల్ ఆడనుంది.

కేఎల్ రాహుల్ కు గాయం కావడంతో..

టెస్ట్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న టీమ్ ఇండియా వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో ఇప్పుడు అనుకోని అవాంతరాలను జట్టుకు తెచ్చి పెట్టినట్టు అయింది. ఐపీఎల్ లో కొద్దిరోజుల కిందట మ్యాచ్ ఆడుతూ రాహుల్ గాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాహుల్.. ఈ నెల 1వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఫీల్డింగ్ చేస్తూ కింద పడడంతో కుడి కాలికి తీవ్ర గాయమైంది. అదే మ్యాచ్ కోసం 11వ నెంబర్ గా క్రీజులోకి దిగినప్పటికీ ఇబ్బందికరంగా కనిపించాడు రాహుల్. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. డబ్ల్యూటీసి ఫైనల్ నాటికి రాహుల్ కోలుకొలేడని బీసీసీఐ ప్రకటించింది. రెండు రోజుల కిందట దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేఎల్ రాహుల్ స్థానంలో డబ్ల్యూటీసి ఫైనల్ ఆడే జట్టులో కొత్తగా ఇషాన్ కిషాన్ ను తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కొద్దిసేపు కిందటే ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. కేఎల్ రాహుల్ తరహాలోనే వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ గా రాణిస్తున్న నేపథ్యంలో అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.

ఐపీఎల్ లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్..

ప్రస్తుతం ఐపీఎల్ లో ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేటుతో పరుగులు చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతూ అదరగొడుతున్నాడు ఈ యువ క్రికెటర్. ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటి వరకు పది మ్యాచ్ లు ఆడిన ఇషాన్ కిషన్.. 293 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత హాయ్యెస్ట్ స్కోర్ 75 పరుగులు కావడం గమనార్హం. రెండు అర్థ సెంచరీలు నమోదు చేశాడు. 136.92 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఇది భారత జట్టు..

డబ్ల్యూటీసి ఫైనల్ కోసం తాజాగా టీమిండియా జట్టును బీసీసీఐ విడుదల చేసింది. ఈ జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), సుబ్ మన్ గిల్, చటేశ్వర పుజార, విరాట్ కోహ్లీ, రహానే, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, ఠాకూర్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్ ఉన్నారు. స్టాండ్ బైగా ముఖేష్ కుమార్, సూర్య కుమార్ యాదవ్ ను బీసీసీఐ తీసుకుంది.