T20 World Cup 2024 – Team India : ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ -20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా తరఫు నుంచి జట్టును ఎంపిక చేసేందుకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ బాధ్యుడు అజిత్ అగర్కార్, కెప్టెన్ రోహిత్ శర్మ ఏప్రిల్ 28న భేటీ కానున్నారు. జట్టు కూర్పుకు సంబంధించి చర్చించనున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వికెట్ కీపర్ స్థానం కోసం తీవ్రంగా పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ స్థానం కోసం జితేష్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే అతడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో పెద్దగా సత్తా చాట లేక పోతున్నాడు. దీంతో సెలెక్టర్లు ఎటూ తెలుసుకోలేకపోతున్నారు. అతడి స్థానంలో సంజు శాంసన్, రిషబ్ పంత్ పేర్లను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
బౌలింగ్ విషయంలో జస్ ప్రీత్ బుమ్రా , మహమ్మద్ సిరాజ్ తో పాటుగా మూడో పేసర్ రోహిత్, అజిత్ ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సిరాజ్ అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. దీంతో బెంగళూరు జట్టు గడిచిన రెండు మ్యాచ్ లలో అతడిని దూరం పెట్టింది. అయితే టి20 వరల్డ్ కప్ లో అతనికి అవకాశం ఇస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మూడో ఫాస్ట్ బౌలర్ కోసం అర్ష్ దీప్ సింగ్, మోహిసిన్ ఖాన్, మాయాంక్ యాదవ్, వైభవ్ అరోరా, ఖలీల్ అహ్మద్ వంటి వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ లో రియాన్ పరాగ్, శివం దుబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి వారు అదరగొడుతున్నారు. నితీష్ రెడ్డి వంటి వర్తమాన ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో కుర్రాళ్లకు టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కోచ్ రాహుల్ ద్రావిడ్, అజిత్ అగార్కర్ ఇవే సంకేతాలు ఇచ్చారు. ఐపీఎల్ లో ప్రతిభ చూపే ఆటగాళ్లకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తామని, సమర్థవంతంగా ఆడే ఆటగాళ్లకు టీమిండియాలో స్థానం కోసం ద్వారాలు తెరిచే ఉంటాయని ప్రకటించారు. ప్రస్తుతం చాలామంది మెరుగైన ప్రదర్శన ఇస్తున్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలనేది అటు కెప్టెన్, ఇటు కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు తలనొప్పిగా మారింది.