Kaviya Maran: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో మ్యాచ్ ఆడితే చాలు.. కెమెరామెన్ల కెమెరాలు ఆటోమెటిక్ గా కావ్య మారన్ వైపు చూపు తిట్టుకుంటాయి. ఆమె హావభావాలను చిత్రీకరిస్తుంటాయి. ఈ జట్టు గతంలో దక్కన్ చార్జర్స్ గా ఉన్నప్పుడు దాని యజమాని వెంకట్రామిరెడ్డి కూతురు గాయత్రి రెడ్డి కి కూడా ఇదే స్థాయిలో క్రేజ్ ఉండేది. అప్పట్లో సోషల్ మీడియా ఈ స్థాయిలో బలంగా లేదు కాబట్టి.. గాయత్రి రెడ్డి ప్రధాన మీడియా వరకే పరిమితమైంది. లేకుంటే ఆమె రేంజ్ మరో విధంగా ఉండేది. దక్కన్ చార్జర్స్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆవిర్భవించిన తర్వాత.. గాయత్రి రెడ్డి స్థానాన్ని కావ్య మారన్ భర్తీ చేస్తున్నారు.. గత సీజన్లలో హైదరాబాద్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేదు. దీంతో కావ్య డీలా పడిపోయింది. కానీ, ఈసారి హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో ఎగిరి గంతేస్తోంది.

కోల్ కతా, గుజరాత్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్.. మిగతా మ్యాచ్లలో విజయాన్ని దక్కించుకుంది. బలమైన ముంబై, బెంగళూరు, పంజాబ్ వంటి జట్లను ఓడించింది.. ముంబై, బెంగళూరు పై అయితే రికార్డు స్థాయిలో స్కోర్స్ సాధించి.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త ఘనతను సృష్టించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వరుస విజయాలతో హైదరాబాద్ జట్టు ఎంత స్థాయిలో అయితే ఫేమస్ అయిందో..కావ్య మారన్ తన హావభావాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీగా గుర్తింపు పొందింది. జట్టు విజయం సాధిస్తే ఎగిరి గంతెయ్యడం, లేకపోతే ముభావంగా ఉండడం కావ్య మారన్ స్టైల్. అందుకే కెమెరామెన్లు ఆమె హావభావాలను చిత్రీకరించేందుకు పోటీలు పడుతుంటారు. హైదరాబాద్ ఆడుతున్నప్పుడు లైవ్ టెలికాస్ట్ లో కెమెరామెన్లు పదేపదే ఆమెను చూపిస్తుంటారు.

ఇక హైదరాబాద్ జట్టు సొంతమైదానంలో గురువారం రాత్రి బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 35 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 51, రజత్ పాటిదార్ 50 పరుగులు చేశారు. చివర్లో గ్రీన్ 37* పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఓటమితో హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. చెత్త షాట్స్ ఆడి మార్క్రం, హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ ఔట్ అయ్యారు. దీంతో కావ్య ఒక్కసారిగా నిరాశకు గురైంది. కీలక బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ కావడంతో ఆమె డీలా పడిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.