Kamindu Mendis : సరిగ్గా అలాంటి అవసాన దశలో శ్రీలంక జట్టు కోచ్ బాధ్యతలను జయ సూర్య చేపట్టాడు. జట్టులో జవసత్వాలు నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు పడుతున్న కష్టం వృధా కావడం లేదు. ఇంగ్లాండ్ జట్టుపై సంవత్సరాల తర్వాత శ్రీలంక టెస్ట్ మ్యాచ్ గెలిచింది. భారత జట్టుపై వన్డే సిరీస్ దక్కించుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టును వైట్ వాష్ చేసింది. అయితే ఇంతటి ప్రయత్నంలో శ్రీలంక జట్టు నుంచి ఒక ధ్రువతార ఆవిర్భవించింది. ఆ ధ్రువ తార పేరే కమిందు మెండిస్. ఏకంగా బ్రాడ్ మంత్ రికార్డును బద్దలు కొట్టాడు.. అద్భుతమైన బ్యాటింగ్ తో సిసలైన స్టార్ గా కొనసాగుతున్నాడు.. జయ సూర్య నాయకత్వంలో శ్రీలంక జట్టుకు భావి నాయకుడిగా ఆవిర్భవించేందుకు తహతహలాడుతున్నాడు. వాస్తవానికి శ్రీలంక జట్టులో కుశాల్ మెండిస్ లాంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చినప్పటికీ వారిని సరిగా వాడుకోలేకపోయారు. దీనికి తోడు రాజకీయాల వల్ల శ్రీలంక క్రికెట్ వ్యవస్థ సర్వనాశనమైంది. జట్టులో సుహృద్భావ వాతావరణం దెబ్బతిన్నది. ఫలితంగా వెస్టిండీస్ జట్టు లాగే తన ఘన కీర్తిని కోల్పోయింది చిన్న జట్లలో ఒకటిగా మారే ప్రమాదం ముందు నిలిచింది. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభం శ్రీలంక జట్టును ఇబ్బందులకు గురిచేసింది. ఇలాంటి సమయంలో శ్రీలంక క్రికెట్ ఆదుకునేందుకు వచ్చాడు కమిందు మెండిస్.
సంచలన ఆట తీరు..
కమిందు మెండి సంచలన ఆట తీరితో ఆకట్టుకుంటున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండవ టెస్టులో ఏకంగా 182 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా క్రికెట్ లెజెండ్ బ్రాడ్ మన్ సరసన నిలిచాడు. టెస్టులలో అత్యంత వేగంగా 1000 పరుగులను సాధించిన మూడవ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు అతడు 5 అంతర్జాతీయ శతకాలు కొట్టేశాడు. అంతేకాదు ఇంగ్లాండు స్టార్ ఆటగాడు జో రూట్ ను దాటేశాడు. అంతేకాదు వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్లలో 50+ పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా ఆవిర్భవించాడు. వాస్తవానికి కమిందు మెండిస్ తన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 61 రన్స్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో 102, 164 రన్స్ చేశాడు. అనంతరం ఇంగ్లాండ్ లో 113 పరుగులు చేశాడు. ఇప్పుడు సొంత గడ్డపై న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండు టెస్టులలో 114, 182* పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ సెంచరీలన్నీ అతడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసినవి కావడం విశేషం. బ్యాటింగ్ మాత్రమే కాదు కమిందు మెండిస్ అద్భుతమైన స్పిన్ బౌలర్ కూడా. అతడు తన రెండు చేతులతో బౌలింగ్ చేయగలడు.. అందువల్లే అతడిని శ్రీలంక జట్టులో సవ్యసాచి అని పిలుస్తుంటారు. భారత జట్టుతో జరిగిన సిరీస్ మాత్రమే కాకుండా అనేక మ్యాచ్లలో అతడు తన ప్రతిభను నిరూపించుకున్నాడు. క్రీజ్ లో బ్యాటర్లకు అనుగుణంగా అతడు బంతులు వేస్తుంటాడు..
స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటాడు
25 సంవత్సరాల ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్ చేయగల కమిందు మెండిస్ అద్భుతమైన టెక్నిక్ ప్రదర్శిస్తుంటాడు. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. కవర్ డ్రైవ్ లు చూడ ముచ్చటగా ఆడుతుంటాడు. దూకుడు కూడా అద్భుతంగా కొనసాగిస్తుంటాడు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లను అద్భుతంగా ఆడతాడు. న్యూజిలాండ్ సిరీస్ లో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. వాస్తవానికి అండర్ -19 కెప్టెన్ గా రాణించినప్పటికీ కమిందు మెండిస్ ను జాతీయ జట్టులోకి రాకుండా శ్రీలంకలో రాజకీయాలు నడిచాయి. ఎట్టకేలకు అతడు జట్టులోకి వచ్చి అతడు తన ప్రతిభ నిరూపించుకోవడంతో.. అందరి నోళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం జయ సూర్య ఆధ్వర్యంలో రాటు తేలుతున్నాడు. ఇలానే తన ఆట తీరు కొనసాగిస్తే శ్రీలంక జట్టుకు భావి కెప్టెన్ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.