https://oktelugu.com/

Jonty Rhodes: ఫలితం ఎలా ఉన్నా.. గంభీర్ ఆలోచన ధోరణి మారదు.. జాంటీ రోడ్స్

ఐపీఎల్ లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపిన తర్వాత గౌతమ్ గంభీర్ చరిష్మా మరింత పెరిగింది. దీంతో అతడు టీమిండియా కోచ్ గా నియమితుడయ్యాడు. శ్రీలంక టోర్నీ ద్వారా భారత జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. టి20 టోర్నీని 3-0 తేడాతో శ్రీలంకపై గెలిచిన భారత్.. వన్డే టోర్నీ విషయానికి వచ్చేసరికి 2-0 తేడాతో కోల్పోయింది. ఫలితంగా గౌతమ్ గంభీర్ తొలి ప్రయాణం మిశ్రమ ఫలితాలను సాధించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 2, 2024 / 08:35 AM IST

    Jonty Rhodes

    Follow us on

    Jonty Rhodes: తొలి టోర్నీ కొంచెం తీపి, కొంచెం చేదు ఫలితాలను ఇవ్వడంతో గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి మారుతుందని చాలామంది భావించారు. కొన్ని కొన్ని మీడియా సంస్థలు అదేవిధంగా వార్తలను ప్రసారం చేశాయి.. ఇక క్రీడా విశ్లేషకుల వ్యాఖ్యల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి పైన ఒకప్పటి స్టార్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ నోరు విప్పాడు..” మైదానంలో ఆడే తీరు పట్ల గౌతమ్ గంభీర్ ఒక స్పష్టమైన వైఖరితో ఉంటాడు. ముఖ్యంగా ఆటగాళ్ల విషయంలో అత్యంత కఠినంగా ఉంటాడు. చివరి వరకు పోరాడాలనేది అతడి నైజం. అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రతి ఆటగాడిలో పోరాట స్ఫూర్తిని నూరిపోస్తూ ఉంటాడు.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకోడు. ప్రతి ఆటగాడు నూటికి నూరు శాతం అద్భుతమైన ప్రదర్శన చేయాల్సిందేనని చెబుతుంటాడు. అదే దిశగా వారికి శిక్షణ ఇస్తూ ఉంటాడని” జాంటీ రోడ్స్ పేర్కొన్నాడు.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జాంటీ రోడ్స్, గౌతమ్ గంభీర్ లక్నో జట్టుకు సేవలందించారు..రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ గా పనిచేశాడు. గౌతమ్ గంభీర్ మెంటార్ గా వ్యవహరించాడు.. గత ఐపిఎల్ సీజన్లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్.. ఆ జట్టును విజేతగా నిలిపాడు. 10 సంవత్సరాల తర్వాత కోల్ కతా జట్టుకు ట్రోఫీ అందించాడు.. ఆ విజయం తర్వాత గౌతమ్ గంభీర్ పేరు మార్మోగిపోయింది. అదే సమయంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ కోసం అమెరికా – వెస్టిండీస్ వెళ్ళిపోయింది. రాహుల్ ద్రావిడ్ శిక్షణలో టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియడంతో.. ఆస్థానాన్ని గౌతమ్ గంభీర్ తో బీసీసీఐ భర్తీ చేసింది.

    కోచ్ గా శ్రీలంక టోర్నీ ద్వారా మొదలుపెట్టిన గౌతమ్ గంభీర్..కట్టా, మీఠా ఫలితాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ పై విమర్శలు వినిపించినప్పటికీ.. జాంటీ రోడ్స్ లాంటివాళ్ళు స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు..” గౌతమ్ క్రికెట్ పై అమితమైన ఆసక్తిని కలిగి ఉంటాడు. అతడికి క్రికెట్ తప్ప మరో వ్యాపకం తెలియదు. ప్రతి ఆటగాడు నుంచి అద్భుతమైన ప్రదర్శనను అతడు ఆశిస్తాడు. ప్లేయర్లపై వెంట్రుక వాసి కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. దూకుడు వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. ప్రతి సందర్భంలో తన జట్టు గెలవాలని బలంగా కోరుకుంటాడు. రికార్డుల విషయాన్ని అతడు ఏమాత్రం పట్టించుకోడు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గా పనిచేస్తున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కొన్ని విషయాలలో సర్దుకుపోవాల్సి ఉంటుంది. భారత జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. వారితో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం గౌతమ్ గంభీర్ కు ఉంది. జట్టును ఏకతాటిపై నడిపించాలి. ఆటగాళ్ల మధ్య సమన్వయాన్ని కుదర్చాలి. ఆటగాళ్లతో సత్సంబంధాలను నడపాల్సి ఉంటుందని” జాంటీ రోడ్స్ పేర్కొన్నాడు.