Jonny Bairstow: బెయిర్ స్టో.. ఇంగ్లాండ్ హిట్టర్.. ఎలాంటి అరి వీర భయంకరమైన బౌలర్ అయినప్పటికీ ఏమాత్రం కనికరం చూపడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటాడు. కసి తీరా బంతిని బాదుతాడు. అందుకే అతడిని ఇంగ్లాండ్ హిట్టర్ అని పిలుస్తారు. ఈ ఆటగాడికి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. భారత పర్యటనలో అతడు గొప్ప ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఉప్పల్, విశాఖపట్నంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో నిరాశపరచిన అతడు..రాజ్ కోట్ లో మొదటి ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాడు.
రాజ్ కోట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు..జో రూట్ వికెట్ త్వరగానే కోల్పోయింది. ఈ క్రమంలో బెయిర్ స్టో క్రీజ్ లోకి వచ్చాడు.. కులదీప్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేయడంతో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో భారత జట్టుపై అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి ఆటగాడిగా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఖాతా తెరవకుండా టీం ఇండియా పై బెయిర్ స్టో వెను తిరగడం ఇది ఎనిమిదో సారి. తద్వారా అతడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా, ఆస్ట్రేలియా ఆటగాడు లియాన్ రికార్డును అధిగమించాడు. కనేరియా, లియాన్ చెరో ఏడుసార్లు డక్ అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా దివంగత ఆటగాడు షేన్ వార్న్, ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ చెరో ఆరుసార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యి మూడో స్థానంలో నిలిచారు.
వాస్తవానికి బెయిర్ స్టో విధ్వంసకరమైన ఆట తీరుకు పెట్టింది పేరు.. గత ఏడాది ఆస్ట్రేలియా తో జరిగిన యాషెస్ సిరీస్ లో ఆకాశమే హద్దుగా ఆడాడు. అతడి స్ట్రైక్ రేట్ చూసిన ఇంగ్లాండ్ జట్టు.. భారత పర్యటనలో ఇతడు ఇరగదీస్తాడని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ నమ్మింది. ఇక్కడికి వచ్చిన తర్వాత భారత బౌలర్లకు బెయిర్ స్టో దాసోహం అవుతున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్ లో 19.60 సగటు తో బెయిర్ స్టో 98 పరుగులు చేశాడు. కనీసం ఆఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడి అత్యధిక స్కోరు 37 పరుగులు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ జట్టు ఇండియాలో పర్యటించినప్పుడు కూడా బెయిర్ స్టో చెప్పుకో తగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అప్పుడు జరిగిన రెండు టెస్టుల్లో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు.