Jasprit Bumrah: ధోని సారధ్యంలో 2011లో గెలిచిన తర్వాత ఇంతవరకు టీం ఇండియా వరల్డ్ కప్ సొంతం చేసుకోలేకపోయింది. అంతేకాదు ఐసీసీ నిర్వహించే ఏ మెగా టోర్నీ లోనూ ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చూపలేకపోతోంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలోనూ దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. కీలకమైన సమయంలో బౌలింగ్ విభాగంలో విఫలమవుతోంది.. ఎంతమంది వర్ధమాన ఆటగాళ్ళను మేనేజ్మెంట్ ప్రయోగించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది. అయితే ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ నకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బౌలింగ్ విభాగాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారని అభిమానుల్లో సందేహం ఉండేది. కానీ దానిని ఇప్పుడు పటా పంచలు చేస్తూ టీం ఇండియా స్పీడ్ గన్ పునరాగమనం చేయబోతున్నాడు.
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ నకు మంగళవారం షెడ్యూల్ విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులకు మేనేజ్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. టీమిండియా స్పీడ్ గన్ జస్ ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్ లో ఆడతాడని స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స పొందుతున్నాడు. వచ్చే నెలలో నేషనల్ క్రికెట్ అకాడమీ లో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో బమ్రా ఆడే అవకాశాలు ఉన్నాయని టీం మేనేజ్మెంట్ చెబుతోంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రా వేగంగా కోరుకుంటున్నారని, నెట్స్ లో ప్రతిరోజు 7 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తున్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లో బుమ్రా ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ ల అనంతరం బుమ్రా పిట్ నెస్ మీద ఒక స్పష్టత వస్తుందని జట్టు మేనేజ్మెంట్ చెబుతోంది. దీనిని బట్టి ఆగస్టులో జరిగే ఆసియా కప్ లో బుమ్రా ఆడే అవకాశాలుంటాయి. ఇదే జరిగితే టీమిండియా బౌలింగ్ బలం మరింత పెరుగుతుంది.
వచ్చే ప్రపంచ కప్ లో టీం ఇండియాకు బుమ్రా బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు. జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా నెట్స్ లో శ్రమిస్తూ బుమ్రా తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి క్రికెట్ కు దూరమయ్యాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న అతడికి మార్చి నెలలో న్యూజిలాండ్ దేశంలో శస్త్ర చికిత్స జరిగింది. అప్పటినుంచి నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు కోలుకుంటున్నాడు. కాగా గాయాలతో టీం ఇండియాకు దూరమైన కేఎల్ రాహుల్, అయ్యర్ కూడా బుమ్రా తో పాటే కోలుకుంటున్నారు. వీరు కూడా ప్రపంచ కప్ లో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.