TTD: తిరుమల తిరుపతి వెంకన్న.. ఆయన కొలువై ఉన్న ప్రాంతం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. రోజుకు వేలాది మంది భక్తులు, విశేషమైన సేవలు, రోజుకు కోట్లాది రూపాయల హుండీ ఆదాయం.. అలాంటి కలియుగ దైవానికి సేవల విషయంలో కొరత ఏర్పడింది. స్వామివారికి కైంకర్యం చేసేందుకు దేశీయ జాతి నాటు ఆవు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆ క్రతవు నిర్వహిస్తున్నారు. దీనిని నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చేయని ప్రయత్నం అంటూ లేదు. సంప్రదించని శాస్త్రవేత్త అంటూ లేడు. కానీ ఇన్నాళ్లకు వారి కృషి ఫలించింది. తిరుమల తిరుపతి వెంకన్నకు దేశీయ నాటు ఆవు పాలు, నెయ్యి తో కైంకర్యాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయింది.
సరోగసి విధానంలో
తిరుమల తిరుపతి వెంకన్నకు నాటు ఆవు పాలు, నెయ్యితో పూజ కైంకర్యాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ సహజసిద్ధంగా నాటు ఆవు పెరిగే వాతావరణం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలో సరోగసి విధానం ద్వారా ఆవు దూడను పుట్టించారు. ఒంగోలు జాతికి చెందిన ఆవు అద్దెగర్బంలో ఆవు దూడను పెంచి గర్భధారణ కాలం పూర్తయిన తర్వాత దానిని జన్మించేలా చేశారు. అలా పుట్టింది దేశీయ సాహివాల్ ఆవు దూడ. దీంతో తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో చేపట్టిన ఐవీఎఫ్ ప్రయోగం విజయవంతమైంది. అంతరించిపోతున్న దేశీయ ఆవుల ఉత్పత్తిని పెంచేందుకు సరోగసి విధానం ద్వారా శాస్త్రీయంగా తొలి సరో గేట్ ఆవుదూడకు తిరుమల తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ ఆయువు పోసింది. ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా గిర్ ఆవుపిండాన్ని ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశపెట్టి షాహివాల్ ఎంబ్రియో ను ఒంగోలు జాతి ఆవులో అభివృద్ధి చేశారు. అనంతరం గర్భవాతి కాలం పూర్తి అయిన తర్వాత దానిని ఆవు దూడగా పుట్టించారు.
గత ఏడాది టెక్నాలజీ ఉపయోగించి ఆరోగ్యవంతమైన, అధిక ప్రోడక్టివిటీని ఇచ్చే దేశీయ ఆవుల ఉత్పత్తి కోసం వెటర్నరీ యూనివర్సిటీ 3.8 కోట్ల ఖర్చుతో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఐదు సంవత్సరాలలో 350 సరో గేటెడ్ దూడలు పుట్టించడమే లక్ష్యంగా తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో ఐవిఎఫ్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 94 సరోగేటివ్ ఆవులను సిద్ధం చేశారు. 18 సరో గేటెడ్ యానిమల్స్ టెస్టింగ్ లో ఉన్నాయి. 11 ఆవుల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు. సరోగసి విధానం ద్వారా మరో రెండు రోజుల్లో ఇంకో రెండు దూడలకు ఆవులు జన్మనివ్వనున్నాయి.
ఇక శ్రీవారి ఆలయానికి రోజుకు 2500 లీటర్ల పాలు అవసరమవుతాయి. ఇందులో రోజుకు 500 లీటర్ల దేశీయ ఆవు పాలు అవసరం ఉంటాయి. స్వదేశీ ఆవుల సంతతి మరింతగా పెరిగితే తిరుమల తిరుపతి దేవస్థానానికి పాల కొరత ఉండదని టీటీడీ వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇక సరోగసి విధానం కోసం మరో ఐదు మంది దాతలు 500 ఆవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రామమయం ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 ఆవులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ 70 ఆవులను వితరణగా అందజేశారు. ఇక వచ్చే ఐదు సంవత్సరాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1000 ఆవులను సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు. శ్రీవారి ఆలయం, అమ్మవారి ఆలయం అవసరాల కోసం వీటి పాలను వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్లు కేవలం ఐవీఎఫ్ విధానంలో మనుషులకు మాత్రమే పిల్లలు పుట్టించేవారు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెటర్నరీ అధికారులు ఒక అడుగు ముందుకేసి జంతువుల్లో కూడా ఆ విధానం ద్వారా విజయవంతం కావడం నిజంగా అద్భుతం.