Pawan Kalyan: పవన సుతుడి సన్నిధిలో పవన్‌ కళ్యాణ్‌.. కొండగట్టుకు పోటెత్తిన అభిమానం

డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌కు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలోఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు.

Written By: Raj Shekar, Updated On : June 29, 2024 5:20 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అదినేత పవన్‌ కళ్యాణ తన ఇంటి దైవం కొండగట్టు అంజన్న దర్శనానికి శనివారం వచ్చారు. హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి రోడ్డు మార్గంలో జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకున్నారు. అర్చకులు పవన్ కల్యాణ్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ఏపీ డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. గతేడాది తన ఎన్నికల ప్రచార రథానికి పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడే పూజలు చేయించారు. ఈ సందర్భంగా ముడుపులు కట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం..
డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌కు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలోఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఈవో పూర్ణకుభం పట్టుకోగా, ప్రధాన స్థానాచార్యులు కపీంద్రస్వామి తలపాగా చుట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీవేంకటేవ్వరస్వామి, శ్రీలక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామివారి ప్రసాదం అందజేశారు.

పోటెత్తిన అభిమానం..
ఇక కొండగట్టుకు పవన్‌ కళ్యాణ్‌ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు దారిపొడవునా నీరాజనం పట్టారు. హైదరాబాద్‌లోని పవన్‌ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులు ఇచ్చి సాగనంపారు. తుర్కపల్లి, శామీర్‌పేట్‌, సిద్ధిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలలతో ఘనస్వాగతం పలికాయి. ఎన్నికల్లో విజయానికి చిహ్నంగా అభిమానులు, పార్టీ శ్రేణులు తల్వార్‌ బహూకరించాయి. ఇక పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోగానే అభిమానులతో అంజన్న క్షేత్రం కిటకిటలాడింది. ఈ సందర్భంగా జనసేనాని ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.