Karimnagar: క్రికెట్.. ప్రపంచంలో ఎక్కువ ఆదరణ ఉన్న ఆట. ఇక ఇది మన ఆట కాకపోయిన మన దేశంలో క్రికెట్‌కు ఏ క్రీడకు లేనంత క్రేజ్ ఉంది. దీంతో తమ పిల్లలను క్రికెటర్‌ను చేయాలని తల్లిదండ్రులు.. క్రికెటర్ కావాలని పిల్లలు సాధన చేస్తున్నారు. అయితే సెలక్షన్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF SELECTIONS) ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తాజాగా బయటపడింది. టాలెంట్ ఉన్నవారిని పక్కన పెట్టి.. అసమర్థులకు అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఎస్.జీ.ఎప్ క్రీడల్లో అవకతవకలపై ఓ క్రీడాకారుడు డీఈవోకు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. సెలక్షన్‌లలో అవకతవకలు జరిగాయని పలువురు యువ క్రీడాకారులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అండర్ – 14 సెలక్షన్ పోటీలు..
SGF అండర్ 14 క్రికెట్ సెలక్షన్స్ లో భాగంగా నవంబర్ 13న అండర్–14 జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. అయితే ఈ సెలక్షన్‌లో సంబంధం లేని వ్యక్తులు, క్రికెట్ నిపుణులు కానివారు సెలెక్టర్లుగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి.. ప్రభుత్వ పీఈటీలు పోటీలను పర్యవేక్షించాల్సి ఉండగా, వారు తమ స్నేహితులైన క్రికెట్ అకాడమీల నిర్వాహకులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని ఆరోపణలున్నాయి.. దీంతో వారు తమ అకాడమీలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నవారినే ఎంపిక చేశారని ఓ విద్యార్థి డీఈవోకు లేఖ రాశాడు. తమకన్నా తక్కువ ప్రతిభ కనబర్చిన వారికీ అవకాశం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తం 20 మందితో కూడిన ఎస్‌ఏఎఫ్ స్క్వాడ్‌లో 9 మంది ఒకే అకాడమీకి చెందిన క్రీడాకారులను ఎంపిక చేయడం విద్యార్థి లేఖకు ఉదాహరణ. ‘మా అకాడమీకి వస్తేనే ఎంపిక చేస్తాం’ అని కొందరు నిర్వాహకులు తల్లిదండ్రులను ఒత్తిడికి గురి చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.

అర్హులను పక్కన పెట్టి..
అర్హులైన ఆటగాళ్లను పక్కనబెట్టి, స్నేహితులు, బంధువులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల స్థానిక ప్రతిభాజ్యోతులు వెనుకబడిపోయారని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విధమైన ఎంపికలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పీఈటీల స్నేహితులు, సంబంధిత అకాడమీల నిర్వాహకులే సెలెక్టర్లుగా వ్యవహరించారని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. కొందరు సెలక్టర్లకు క్రికెట్ అంటే ఏమిటో కూడా తెలియదని పేర్కొంటున్నారు.కఠినంగా శ్రమించి శిక్షణ పొందినా, పరిచయం లేకపోతే అవకాశం ఇవ్వడం లేదని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ క్రీడాశాఖ అధికారుల విచారణ జరిపి పారదర్శకంగా పని చేయాలనే డిమాండ్ చేస్తున్నారు.
క్రీడల్లో పక్షపాత ధోరణి కరీంనగర్‌లో మాత్రమే కాక, ఇటీవలి సంవత్సరాల్లో ఇతర విభాగాల సెలక్షన్‌లలో కూడా ఇలాంటి పక్షపాతం ఆరోపణలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర స్థాయి ఎంపికల్లో న్యాయబద్ధతను కాపాడటానికి కఠిన నియమాలు, స్వతంత్ర ప్యానెల్ అవసరమని క్రీడా సమాజం అభిప్రాయపడుతోంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక జరిగితేనే గ్రామీణ యువత అంతర్జాతీయ స్థాయికి ఎదగగలరని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వివాదంపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని, ఎంపిక ప్రక్రియను రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.