IPL Retention 2025: ఐపీఎల్ లో టోర్నీ సాధించకపోయినప్పటికీ బెంగళూరు జట్టుకు విశేషమైన ఆదరణ ఉంది. గత సీజన్లో ట్రోఫీ దాకా వచ్చినప్పటికీ.. తృటి లో కప్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఈసారి ఎలాగైనా సాధించాలని భావిస్తోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కప్ సాధించిన బెంగళూరు.. పురుషుల విభాగం లోకి వచ్చేసరికి ఆ స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోతోంది. అయితే ఈసారి ఎలాగైనా ఆ అపప్రదను తొలగించుకోవాలని భావిస్తోంది. అందుకే 2025 సీజన్ కు జట్టును అత్యంత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా కెప్టెన్ ను కూడా నియమించుకోవాలని అనుకుంటున్నది.
డూ ప్లెసిస్ స్థానంలో..
ప్రస్తుతం బెంగళూరు కెప్టెన్ గా డూ ప్లెసిస్ కొనసాగుతున్నాడు. అతని వయసు కూడా 40 కి దగ్గరగా వచ్చింది. గతంలో మాదిరిగా అతడు ఆడలేక పోతున్నాడు. జట్టును కూడా ఆశించినంత స్థాయిలో ముందుకు తీసుకెళ్ల లేకపోతున్నాడు. దీంతో ఈసారి అతడిని బెంగళూరు యాజమాన్యం పక్కనపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియాలో దీనికి సంబంధించి కథనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీకి 21 కోట్లు ఇచ్చి బెంగళూరు రిటైన్ చేసుకుంది. బెంగళూరు కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తన వద్ద ఉంచుకుంది. ఇందులో విరాట్ కోహ్లీ, రజత్, యష్ దయాళ్ ఉన్నారు. ఇందులో రజత్, యశ్ కు 11, ఐదు కోట్ల చెల్లించింది. మొత్తంగా చూస్తే విరాట్ కోహ్లీని బెంగళూరు జట్టు రిటైన్ చేసుకోవడం వెనుక కెప్టెన్సీ అప్పగించే ఉద్దేశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై విరాట్ కోహ్లీ ఇంతవరకు నోరు విప్పలేదు.
విరాట్ కోహ్లీ గత సీజన్లో అదరగొట్టాడు. అద్భుతంగా పరుగులు చేసి ఏకంగా ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కాపాడాడు.. కొన్ని సందర్భాలలో ఆటగాళ్లు సహకరించకపోయినప్పటికీ తను ఒక్కడే జట్టు భారాన్ని మోసాడు. దీంతో ఈసారి ఎలాగైనా కప్ సాధించాలి అనే ఆలోచనతో ఉన్న ఆ జట్టు.. విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా పనిచేసినప్పటికీ.. అప్పటికి ఇప్పటికీ విరాట్ ఎంతో పరిణతి సాధించాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీకి మరొకసారి బెంగళూరు జట్టు బాధ్యతలు అప్పగించేందుకు ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపై విరాట్ కోహ్లీ ఇంతవరకు నోరు విప్పక పోయినప్పటికీ.. త్వరలో జరిగేది అదేనని తెలుస్తోంది. అందువల్లే 21 కోట్లు చెల్లించి అతడిని జట్టులో ఉంచుకుందని.. విరాట్ సారధ్యంలో కప్ సాధిస్తామనే ఆశాభావాన్ని బెంగళూరు జట్టు వ్యక్తం చేస్తోంది.