IPL Mega Auction 2025 : జెడ్డా నగరం వేదికగా జరుగుతున్న వేలంలో తొలిరోజు 84 మంది ప్లేయర్లు రేసులో ఉన్నారు. వీరి కోసం వేలం ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. ఈసారి వేలంలో ఎడమ చేతి వాటం ఉన్న బ్యాటర్ల కు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఈసారి లక్నో జట్టు అలాంటి ఎడమ చేతి వాటం ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. అందని కలగా ఉన్న ఐపీఎల్ కప్ ను ఈసారి నిజం చేసుకొనే పనిలో పడింది. అందువల్లే జట్టును మరింత బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ప్రత్యర్థి దుర్భేద్యంగా చేస్తోంది. స్టార్ ఆటగాళ్లకు భారీగా చెల్లిస్తూ.. జట్టును అత్యంత బలోపేతం చేసుకుంటోంది.
రిషబ్ పంత్..
టీమిండియా కు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ ఎడమ చేతి వాటం ఆటగాడు. మెగా వేలంలో అతడు రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయాడు. అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. లక్నో జట్టు అతడిని 27 కోట్లకు కొనుగోలు చేసింది.
డేవిడ్ మిల్లర్
ఇక మరో ఎడమ చేతివాటం ఆటగాడు డేవిడ్ మిల్లర్ ను కూడా లక్నో జట్టు కొనుక్కుంది. ఇతడికోసం 7.5 కోట్లు ఖర్చు పెట్టింది.. గత సీజన్ వరకు అతడు గుజరాత్ జట్టుకు ఆడాడు. ఇటీవలి రిటైన్ జాబితాలో అతని పేరుని గుజరాత్ జట్టు పేర్కొనకపోవడంతో బయటికి రావాల్సి వచ్చింది.. అయితే ఇతడిని విన్నింగ్ హ్యాండ్ గా పరిగణిస్తూ లక్నో జట్టు కొనుగోలు చేసింది.
నికోలస్ పూరన్
పొట్టి క్రికెట్లో అత్యంత డేంజరస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ ముందు వరుసలో ఉంటాడు. ఇతడిని లక్నో జట్టు 21 కోట్లకు ఇటీవల రిటైన్ చేసుకుంది. వెస్టిండీస్ జట్టుకు చెందిన నికోలస్ విధ్వంసకరమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా చూస్తే లక్నో జట్టులో ఈ డేంజరస్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ తో డేవిడ్ మిల్లర్, రిషబ్ పంత్ టై అప్ కానున్నారు. వీరి ముగ్గురితో లక్నో జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. గత సీజన్లో అంతంతమాత్రంగానే ఆడిన లక్నో జట్టు.. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని భావిస్తోంది. అందువల్లే హేమా హేమీలైన ఆటగాళ్ళను కొనుగోలు చేస్తోంది.
ఇక గత సీజన్లో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక నాట్ కెప్టెన్ రాహుల్ తో గొడవ పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు దారుణమైన వైఫల్యాన్ని ప్రదర్శించింది. దీంతో మైదానంలో ఉన్న సంజీవ్ రాహుల్ తో వాగ్వాదానికి దిగాడు. అది అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఆ సంఘటన తర్వాత లక్నో జట్టు రాహుల్ ను వదిలించుకుంది.