https://oktelugu.com/

IPL : CSK, MI పని అయిపోయినట్టేనా..

IPL : ఐపీఎల్ ఇప్పటివరకు 17 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. చెరి ఐదుసార్లు ట్రోఫీలు దక్కించుకొని.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) సంయుక్త విజేతలుగా కొనసాగుతున్నాయి.

Written By: , Updated On : March 31, 2025 / 12:30 PM IST
IPL

IPL

Follow us on

IPL : ఐపీఎల్ ఇప్పటివరకు 17 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. చెరి ఐదుసార్లు ట్రోఫీలు దక్కించుకొని.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) సంయుక్త విజేతలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు ఐపీఎల్లో అత్యంత విలువైన టీమ్ లు గా ఉన్నాయి. చెన్నై జట్టు ధోని నాయకత్వంలో ఐదుసార్లు విజేతగా నిలవడం విశేషం. ముంబై జట్టును కూడా రోహిత్ శర్మ అదే స్థాయిలో ఛాంపియన్ గా నిలపడం విశేషం.. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ గత సీజన్ నుంచి ముంబై జట్టుకు నాయకత్వం వహించడం లేదు. కేవలం కీలక ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు. గత సీజన్ నుంచి ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. గడచిన సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు చెప్పుకోదగిన స్థాయిలో విజయాలు సాధించలేదు. ఇక ప్రస్తుత సీజన్ ప్రారంభ మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడింది. తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. ఇక రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.. ఇక గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహించాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. తాత్కాలిక కెప్టెన్, పూర్తిస్థాయి కెప్టెన్ ల నాయకత్వంలో ముంబై జట్టు వరుసగా ఓటములు ఎదుర్కోవడం విశేషం. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై జట్టు బ్యాటింగ్ అత్యంత పేలవంగా సాగుతుండడం విశేషం.

Also Read : ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్లు వీరే

చెన్నై జట్టు కూడా..

ఇక ఈ ఐపీఎల్లో ప్రారంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆ తదుపరి మ్యాచ్లలో చెన్నై జట్టు ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయింది. ఇప్పటివరకు ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరిగింది. లోకల్ పిచ్ అడ్వాంటేజ్ ను చెన్నై జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. అంతేకాదు 17 సంవత్సరాల తర్వాత సొంత మైదానంలో బెంగుళూరు చేతిలో ఓడిపోయి చెన్నై జట్టు పరువు తీసుకుంది. ఇక ఆదివారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ మూడు విభాగాలలో చెన్నై జట్టుతో పోల్చితే రాజస్థాన్ రాయల్స్ కాస్త బలహీనమైనదే. అయినప్పటికీ చెన్నై జట్టు విజయం సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ పదో స్థానంలో ఉంది.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో చెన్నై జట్టు, ముంబై జట్టు బ్యాటింగ్ ఏ మాత్రం బాగోలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల పని అయిపోయిందని.. ఈసారి కొత్త ఛాంపియన్ ఆవిర్భవిస్తారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : ఐపీఎల్‌లో 18 సీజన్లలో ఆడిన ప్లేయర్లు ఎవరంటే?