Ms Dhoni: ధోని అభిమానులకు గుడ్ న్యూస్.. సీఎస్కే జట్టుకు బీసీసీఐ ఆయాచిత వరం ప్రకటించేసిందిగా..

2024లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసిన ధోని.. ఈ సీజన్లో ఐపీఎల్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని గత కొద్దిరోజులుగా స్పోర్ట్స్ వర్గాల్లో విపరితమైన ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ధోని రిటైనింగ్ పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 17, 2024 7:51 am

Ms Dhoni

Follow us on

Ms Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విడదీయరాని అనుబంధం.. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా, నాటి నుంచి 2023 వరకు ఆ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించాడు. ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అప్పట్లో చెన్నై జట్టుపై ఆరోపణలు రాకుంటే .. ఇంకా మరిన్ని ట్రోఫీలను ఆ టీమ్ కు ధోని అందించేవాడు. చెన్నై జట్టుకు తిరుగులేని విజయాలు అందించిన నేపథ్యంలో ధోనిని ఆ జట్టు అభిమానులు తలా(అన్న) అని పిలవడం మొదలుపెట్టారు. 2023లో చెన్నై జట్టును విజేతగా నిలపడంలో ధోని తీవ్రంగా కృషి చేశాడు. గుజరాత్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తన మార్క్ ప్రదర్శనతో పాటు ఎప్పటికప్పుడు మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఫలితంగా చెన్నై జట్టు విజేతగా ఆవిర్భవించింది. అయితే 2024 సీజన్లో ధోని తన అభిమానులకు ఒక స్వీట్ షాక్ ఇచ్చాడు. టోర్నీ రేపు ప్రారంభమవుతుందనగా.. బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్లో అనూహ్యంగా కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానాన్ని రుతు రాజ్ గైక్వాడ్ తో భర్తీ చేశాడు. అయితే 2024 సీజన్లో చెన్నై జట్టు ఆశించినంత స్థాయిలో నాటతీరిన ప్రదర్శించలేకపోయింది.

2024లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసిన ధోని.. ఈ సీజన్లో ఐపీఎల్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని గత కొద్దిరోజులుగా స్పోర్ట్స్ వర్గాల్లో విపరితమైన ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ధోని రిటైనింగ్ పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చెన్నై అభిమానులు ఒక్కసారిగా ఆందోళనలో కూరుకు పోయారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో “తలా ఆడాలి. చెన్నై గెలవాలి” అనే నినాదాన్ని భుజాల పైకి ఎత్తుకున్నారు.. ధోనిని, చెన్నై జట్టును ట్యాగ్ చేస్తూ వారు ఆ నినాదాలను చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై అభిమానులకు, చెన్నై జట్టుకు బిసిసిఐ శుభవార్త చెప్పిందని జాతీయ మీడియా ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దాని ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఆటగాళ్లకు అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా గుర్తించే నిబంధనకు బీసీసీఐ అనుమతి ఇచ్చిందని ఆ కథనంలో పేర్కొంది. ఒకవేళ గనుక ఇది నిజమైతే తక్కువ ధరకు మిస్టర్ కూల్ ను చెన్నై జట్టు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఇటీవల ఐపీఎల్ జట్లతో బీసీసీఐ పెద్దలు సమావేశమయ్యారు. ముఖ్యంగా రిటైనింగ్ నిబంధనలపై ప్రధానంగా చర్చించారు. ఆ సందర్భంలో షారుక్ ఖాన్, నెస్ వాడియా మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగినప్పటికీ.. రిటైనింగ్ నిబంధన ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగానే జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రసారం చేసినట్టు తెలుస్తోంది. ఇక చెన్నై జట్టులోకి ధోని అన్ క్యాప్డ్ విభాగంలో కొనసాగుతాడా? లేకుంటే అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటాడా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే 2024 సీజన్లో ధోని బ్యాటింగ్ లో చివరి స్థానంలో వచ్చాడు. వయసు పెరగడం, ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో అతడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. వేగానికి సిసలైన ప్రతీక అయిన ఐపీఎల్ లో ఇన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్న ధోని ఆడతాడా అనేది ఒకింత అనుమానం గానే ఉంది.