IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. రెండు నెలల పాటు నిరంతరాయంగా సాగిన ఈ క్రికెట్ పండగ ఫైనల్ మ్యాచ్ మంగళవారంతో ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడంతోపాటు మూడు రోజులు ఈ మ్యాచ్ కోసం చూసేలా చేసింది వాతావరణం. గుజరాత్ జట్టు సొంత మైదానంలో ఆ జట్టును ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కప్ సొంతం చేసుకుంది. చెన్నై జట్టు విజేతగా నిలిచిన ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఆ రికార్డులు ఏంటో మీరు చదివేయండి.
ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న పిన్న వయస్కుడు గిల్..
గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సుబ్ మన్ గిల్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. టోర్నీ ఆధ్యంతం అద్భుతమైన ఫామ్ కొనసాగించి భారీగా పరుగులు చేశాడు. గుజరాత్ జట్టుకు ఓపెనర్ గా 17 ఇన్నింగ్స్ లో 890 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఈ యంగ్ క్రికెటర్. అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న చిన్న వయసు ఆటగాడిగా మరో రికార్డు నమోదు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. 23 ఏళ్ల వయసులో గిల్ ఈ క్యాప్ సాధించాడు. అంతకు ముందు రుతురాజ్ గైక్వాడ్ 24 ఏళ్ల పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ రికార్డును ఈ ఏడాది గిల్ బ్రేక్ చేశాడు.
ఐపీఎల్ లో 250 మ్యాచ్ లు ఆడిన ఏకైక ఆటగాడిగా ధోని రికార్డు..
ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పలు రికార్డులను సృష్టించాడు. ఐదు ఐపీఎల్ టోర్నీలు గెలిచిన రెండో కెప్టెన్ గా ధోనిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 250 మ్యాచ్ లు ఆడిన ఏకైక ఆటగాడిగా ధోని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2018 నుంచి తొలి క్వాలిఫయర్ లో విజయం సాధించిన జట్టు కప్ ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కూడా ఇదే సీన్ మళ్లీ రిపీట్ అయింది. గుజరాత్ పైనే తొలి క్వాలిఫైయర్ లో చెన్నై జట్టు విజయం సాధించింది.
200కుపైగా స్కోర్లు 37 సార్లు నమోదు..
ఈ ఏడాది అత్యధిక సార్లు 200 స్కోర్లు నమోదు అయ్యాయి. 2023 ఐపీఎల్ సీజన్ లో మొత్తం 74 మ్యాచులు జరగగా, ఇందులో 37 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు నమోదు అయ్యాయి. గతేడాది 18 సార్లు మాత్రమే నమోదు కాగా ఈసారి ఆ సంఖ్య డబుల్ అయింది. అలాగే, 200కు పైగా లక్ష్య సాధన కూడా ఈ ఏడాది అధిక మ్యాచ్ లో జరిగింది. ఈ సీజన్ లో ఎనిమిది సందర్భాల్లో 200 స్కోరును పలు జట్లు చేదించాయి. ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు, కోల్ కతా, లక్నో, పంజాబ్, హైదరాబాద్ జట్లు ఒక్కోసారి 200కుపైగా లక్ష్యాలను చేదించాయి.
భారీగానే సెంచరీలు.. అర్థ సెంచరీలు నమోదు..
గత సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది కూడా ఐపీఎల్ లో భారీగా సెంచరీలు, అర్థ సెంచరీలు నమోదయ్యాయి. గత ఏడాది ఎనిమిది సెంచరీలు మాత్రమే నమోదు కాగా, ఈ ఏడాది 12 సెంచరీలు నమోదు అయ్యాయి. ఇందులో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గిల్ మూడు, విరాట్ కోహ్లీ రెండు శతకాలు బాదారు. బ్రూక్, వెంకటేష్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, క్లాసెన్, గ్రీన్ ఒక్కో సెంచరీ బాదారు. ఈ సీజన్ లో అర్థ శతకాలు భారీగానే నమోదయ్యాయి. 153 సార్లు బ్యాటర్లు 50కిపైగా పరుగులు చేశారు. ఇదే సీజన్ లో యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో అత్యంత వేగ వంతమైన అర్థ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు.
అత్యధిక సిక్సులు నమోదు..
ఈ ఏడాది ఐపీఎల్ లో 1124 సిక్సులు కొట్టారు బ్యాటర్లు. ఓ ఐపీఎల్ లో ఇదే అత్యధికం కావడం విశేషం. గత ఏడాది 1062 సిక్సులు నమోదు కాగా ఇప్పుడు ఏకంగా 62 సిక్సులు అధికంగా కొట్టారు. అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ గా బెంగళూరు ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ (36) పేరిట రికార్డు ఉంది. భారత ఆటగాళ్లు గిల్ 33, రుతురాజ్ గైక్వాడ్ 30, రింకూ సింగ్ 29 ఈ జాబితాలో ఉన్నారు. ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా గిల్ అవతరించాడు. ఒక మ్యాచ్ లో పది సిక్సులు కొట్టాడు.
ఐదు వికెట్లు సాధించిన పలువురు బౌలర్లు..
ఈ ఏడాది ఐపీఎల్ లో బౌలర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈసారి నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు కాగా, అందులో ముగ్గురు భారత బౌలర్లే ఉన్నారు. మార్క్ ఉడ్ 5/14, భువనేశ్వర్ కుమార్ 5/30, మధ్వాల్ 5/5, మోహిత్ శర్మ 5/10 ఈ ఘనత సాధించారు. పర్పుల్ క్యాప్ విజేతగా గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ షమీ 28 వికెట్లుతో నిలిచాడు.
చివరి బంతికి విజయం సాధించిన జట్లు..
ఈ ఏడాది అనేక మ్యాచులు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. లీగ్ స్టేజిలో చివరి బంతికి విజయం సాధించడం, ఓడిపోవడం చాలా మ్యాచ్ ల్లో జరిగాయి. లీగ్ మ్యాచ్ ల్లో ఇలా జరగడం సాధారణం. అయితే, ఫైనల్ మ్యాచ్ లో ఇలా జరగడం విశేషం. గుజరాత్ జట్టుపై ఫైనల్ లో చెన్నై జట్టు చివరి బంతికి గెలిచి కప్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం రెండోసారి గతంలోనూ సీఎస్కే ఆడిన మ్యాచ్ కావడం విశేషం. 2008 సీజన్ లో చెన్నైపై రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది.
అత్యధిక రన్ రేట్ తో అదరగొట్టిన ఆటగాళ్లు..
ఐపీఎల్ లో పరుగులు వరద ఈ ఏడాది పారింది. అందుకు తగ్గట్టుగానే బ్యాటర్లు రెచ్చిపోయారు. దీంతో అత్యధిక రన్ రేట్ నమోదైన సీజన్ గా ఇది మారింది. గత ఏడాది 8.54 ఉండగా ఈసారి 8.99 కు చేరింది. ఈ సీజన్ లో తొలి ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 183 పరుగులు కావడం విశేషం. 2018లో 172 పరుగులు యావరేజ్ తో పరుగులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ సగటు ఇన్నింగ్స్ స్కోర్ పెరిగింది.
అంబటి రాయుడు అరుదైన రికార్డు..
ఐపీఎల్ ఫైనల్ కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు చివరి మ్యాచ్ లో అదరగొట్టాడు. దీంతో పాటు ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎక్కువ టైటిళ్ల విజయాల్లో భాగస్వామిగా ఉన్న ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. గతంలో రోహిత్ శర్మ పేరిట ఈ రికార్డు ఉంది. దీనిని తాజాగా అంబటి సమం చేశాడు. ముంబై, చెన్నై జట్ల తరఫున మూడేసి సార్లు కప్పు అందుకున్నాడు.
అత్యధిక పరుగులు భాగస్వామ్యం టార్గెట్
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ డెవాన్ కాన్వే. ఈ సీజన్ లో అతడు 672 పరుగులు సాధించాడు. గతంలో మైక్ హసి 2013లో 733 పరుగులు చేశాడు. ఈ ఐపిఎల్ లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం మాత్రం విరాట్ కోహ్లీ – డూప్లెసిస్ (939) జోడి సాధించింది. ఐపీఎల్ ఫైనల్స్ లో అత్యధిక టార్గెట్ ను చేదించిన నాలుగో మ్యాచ్ ఇదే. 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో సీఎస్కే 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2014లో పంజాబ్ పై కోల్ కతా 200 పరుగులను ఛేదించి విజయం సాధించింది.
Web Title: Ipl 2023 breaking all the records these are the highlights of this season
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com