Dastagiri Settlements: దస్తగిరి.. ఇటీవల తరచూ వినిపించే మాట ఇది. వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ4 నిందితుడు. కేసులో అప్రూవర్ గా మారి బెయిల్ పై ఉన్నాడు. అలా అని అతడిది ఏదో పెద్ద బ్యాక్ గ్రౌండ్ కూడా కాదు. కొద్దిరోజుల పాటు వివేకా వద్ద కారు డ్రైవర్ గా పనిచేశాడు. అక్కడ పనిమానేసి తోపుడుబండి తో ఐస్ క్రీమ్స్ అమ్ముకునేవాడు. అనూహ్యంగా వివేకా హత్యలో నిందితుడిగా చిక్కాడు. సీబీఐ ఇతడ్ని అప్రూవర్ గా మార్చి కేసులో కీలక సమాచారం పొందింది. అయితే బెయిల్ పై ఉన్న దస్తగిరి కుదురుగా ఉండడం లేదు. ఏకంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగన్ లపైనే ఆరోపణలు చేసేటంతటి స్థాయికి వెళ్లాడు. ప్రస్తుతం సెలబ్రిటీ హోదా దక్కించుకున్నాడు.
అయితే తాజాగా ఆయన తన దాదాగిరి స్టైల్ తో రెచ్చిపోతున్నాడు. ఏకంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ హల్ చల్ సృష్టిస్తున్నాడు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ఓ వివాదాస్పద స్థలం విషయంలో దస్తగిరి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వివేకా హత్యకేసులో ప్రభుత్వం అతడి రక్షణ కోసం పోలీసులను నియమించింది. నేరుగా వారిని తన వెంట తీసుకొని వెళ్లి బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలై బయటికొచ్చారు. ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి తనకు ప్రాణ భయం ఉందని సీఎం జగన్ పై ఆరోపణల వర్షం గుప్పించారు. దీంతో వెంటనే ప్రభుత్వం దస్తగిరికి భారీ భద్రత కల్పించింది.
అయితే తన ప్రాణానికి సీఎం జగన్ కు లింకు పెట్టానన్న ధైర్యమో… లేకుంటే తన భద్రత కోసం పోలీసులు వచ్చారని అదునో తెలియదు కానీ తోపుడుబండిపై ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని మానేశాడు. తన రక్షణగా వచ్చిన పోలీసులను వెంటబెట్టుకొని వివాదాస్పద స్థలాల్లోకి ప్రవేశించి దాదాగిరికి తెరలేపాడు. ఎవరైనా తన మాట వినకుంటే వైఎస్ వివేకాకు పట్టిన గతే పడుతుంది అని దస్తగిరి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడు బాధితులు చెబుతున్నారు. ఒక హై ప్రొఫైల్ హత్య కేసులో నిందితుడిగా ఉంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తికి ప్రభుత్వం ఇంత భారీ భద్రత కల్పించడం ఏంటంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.