Dhoni-Jadeja: భారత క్రికెట్ జట్టులో అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు క్రికెటర్ల పేర్లు చెప్పాల్సి వస్తే ముందుగా మహేంద్రసింగ్ ధోని, రవీంద్ర జడేజా అని ఎవరైనా చెబుతారు. వీరిద్దరూ జట్టులో ఆటగాళ్లగానే కాకుండా అంతకుమించిన సాన్నిహిత్యంతో ఉండేవారు. రవీంద్ర జడేజా ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మహేంద్ర సింగ్ ధోని ఆదుకునేవాడు. ఒకరకంగా చెప్పాలంటే భారత జట్టులో ఇన్నేళ్లపాటు జడేజా కొనసాగాడు అంటే దానికి ధోని కారణమని చాలామంది చెబుతారు. అయితే ఈ మధ్యకాలంలో ధోనీకి – జడేజాకు మధ్య చెడిందని, వీరి మధ్య గొడవ కూడా జరిగిందని చెబుతున్నారు. గత ఏడాది నుంచే వీరిద్దరి మధ్య పొరపొచ్చులు వచ్చాయని చెబుతున్నారు.
అత్యంత సన్నిహితంగా ఉండే ధోని, రవీంద్ర జడేజా మధ్య గత ఏడాది ఐపీఎల్ సందర్భంగా గొడవ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా గత ఏడాది సీజన్ ఆరంభానికి ముందు జడేజాను యాజమాన్యం ప్రకటించింది. కానీ ఆశించిన స్థాయిలో జడేజా జట్టును ముందుకు నడిపించలేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి.. మళ్లీ ధోనీకి పగ్గాలు అప్పగించారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందంటూ పెద్ద ఎత్తున బయట ప్రచారం జరిగింది. ఇదే సమయంలో జడేజా కూడా సీఎస్కే కు సంబంధించిన ట్వీట్లు, ఇన్ స్టా పోస్టులను డిలీట్ చేయడంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. ఏడాది ఐపీఎల్ లో ధోని కన్నా ముందు జడేజా బ్యాటింగ్ కు వస్తే ధోని.. ధోని అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధోని ఫ్యాన్స్ ను టార్గెట్ చేసిన జడేజా ఒక ట్వీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మరింత గొడవ పెద్దదైంది. దీనిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాశీ విశ్వనాథన్ ఏమన్నారంటే..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ జడేజా, ధోని మధ్య గొడవ గురించి స్పందిస్తూ.. ‘ఇలా జరిగినప్పుడు జడేజా బ్యాటింగ్ కు వెళితే ప్రేక్షకులు అందరూ ధోని రావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల జడేజా బాధపడాల్సి వచ్చింది. ఇలాంటి ఒత్తిడి ఏ ఆటగాడికైనా ఉండే అవకాశం ఉంది. కానీ దీని గురించి జడేజా ట్విట్ చేసిన, ఎప్పుడూ ఎవరితోనూ ఏమి అనలేదు’ అని పేర్కొన్నాడు. అభిమానులు ఈ విధంగా గొడవ చేసిన తర్వాత ధోని రావడం కోసం తాను త్వరగా అవుట్ కావాలని కొందరు అభిమానులు కోరుకుంటున్నారని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జడేజాతో విశ్వనాథన్ చాలా సీరియస్ గా మాట్లాడుతున్న వీడియోలు కూడా నెట్టింట అప్పుడు వైరల్ గా మారాయి. దీంతో జడేజాతో ధోని గొడవ పెద్దదైందంటూ ప్రచారం జరిగింది. అందుకే సీఎస్కే యాజమాన్యం రంగంలోకి దిగింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారం పైన తాజాగా విశ్వనాథన్ స్పందించారు. ఇదంతా ఆటలో సహజమేనని, ఆ వీడియోని చూసిన వాళ్ళు తానేదో జడేజాను తిట్టి పారేస్తున్నానని అనుకున్నారన్నారు. కానీ అటువంటిదేమీ జరగలేదని మ్యాచ్ గురించి అతను ఆడిన విధానం గురించి మాట్లాడుకున్నామని విశ్వనాథన్ స్పష్టం చేశారు. క్రికెట్ అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, కుటుంబంలోనే సమస్యలు వస్తున్నప్పుడు జట్టులో సమస్యలు రావడం సహజమేనని ఆయన స్పష్టం చేశాడు. ఇటువంటి వాటిని పెద్దవి చేసి చూపించడం తగదని అభిమానులకు హితవు పలికాడు.
డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రాకూడదు..
ప్రతి జట్టులోను ఈ తరహా ఇబ్బందులు ఉంటాయని చెప్పిన విశ్వనాథన్.. అవి డ్రెస్సింగ్ రూమ్ బయటకు రాకూడదని స్పష్టం చేశాడు. టీమ్ వాతావరణం సానుకూలంగా ఉండాలని, తమకు తెలిసి జట్టులో ఎటువంటి ఇబ్బందులు లేవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశాడు. జడేజా ఎప్పుడు ధోనీకి గౌరవాన్ని ఇస్తాడని, ఫైనల్ తర్వాత కూడా తన ఇన్నింగ్స్ ధోనీకే అంకితం ఇచ్చినట్లు జడ్డు వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా విశ్వనాథన్ గుర్తు చేశాడు. ధోని అంటే జడ్డుకు ఎంతో గౌరవం అని, వారిద్దరి మధ్య లేనిపోని మనస్పర్ధలకు, అపోహలకు అభిమానులు తావు ఇవ్వవద్దని ఈ సందర్భంగా చెన్నై జట్టు సీఈవో వెల్లడించాడు.
Web Title: Dhoni jadeja fight csk ceo viswanathan revealed the real thing
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com