
నడిపించే నాయకుడిని బట్టే ఆ టీమ్ పనితీరు ఆధారపడి ఉంటుంది. నాయకుడు సరిగా ఉంటేనే టీమ్ సక్సెస్ కాగలుగుతుంది. ఎందుకంటే టీమ్ లీడరే ఆ టీమ్‌కు ఫైనల్ కాబట్టి.. ఆయన చూపిన మార్గంలోనే మిగితా సభ్యులు నడుస్తారు కాబట్టి. అతడు దూకుడుగా ఉంటే.. అందరూ దూకుడుగానే వ్యవహరిస్తారు. లేదా అతడు నిరుత్సాహంలో ఉంటే.. టీమంతా నిరుత్సాహంలోనే ఉంటుంది. అందుకే.. టీమ్ లీడరే ఏ టీమ్‌కైనా మార్గనిర్దేశకుడనే చెప్పాలి. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. మరి ఈ ఐపీఎల్‌లో జట్ల కెప్టెన్ల పాత్ర కీలకం కానుంది. మరి ఐపీఎల్‌లో పాల్గొనబోతున్న ఏ జట్టు కెప్టెన్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందామా..?
రోహిత్.. ముంబయి ‘విన్’డియన్స్..
ఐపీఎల్‌లో తిరుగులేని జట్టంటే అది ముంబయి ఇండియన్స్. ఆ జట్టు సారథి రోహిత్ శర్మ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ముంబయిని విజేతగా నిలిపిన కెప్టెన్. 116 మ్యాచులకు నేతృత్వం వహించి.. 70 సార్లు గెలిపించాడు. అతడి విజయాల శాతం 60.34. ఇక లీగ్ మొత్తంలో 200 మ్యాచుల్లో 31.31 సగటు, 130 స్ట్రైక్‌రేట్‌తో 5,230 పరుగులు సాధించాడు హిట్‌మ్యాన్. ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు, 213 సిక్సర్లతో సక్సెస్ రేటులో ఉన్నాడు. 2021లో ఫామ్ సైతం బాగుంది. సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లోనూ హాఫ్ సెంచరీలు, చెన్నైలో కష్టతరమైన పిచ్‌కం సెంచరీ బాదేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అందుకున్నా వన్డేల్లో మెరుగైన స్కోరు మాత్రం చేయలేకపోయాడు.
పంత్‌ను ఆపతరమా..
ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్. అటు శిఖర స్థాయి.. ఇటు పతన స్థాయి.. రెండింటినీ తక్కువ సమయంలో చూసిన ఆటగాడు రిషబ్ పంత్. శ్రేయస్ గాయపడడంతో ఈసారి ఢిల్లీ సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడు. గతంలో దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి నాయకత్వం వహించిన అనుభవం అతడికి ఉంది. ఐపీఎల్‌లో 68 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 35.23 సగటు.. 151 స్ట్రైక్‌రేట్‌తో 2,079 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు, 103 సిక్సర్లు తన ఖాతాలో ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా తన భారీ హిట్టింగ్‌తో దడపుట్టించే అతడిపై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. 2021 ఆరంభం నుంచి పంత్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో 97, 59*తో అదరగొట్టాడు. అహ్మదాబాద్‌లోనైతే సెంచరీ చేశాడు. టీ20ల్లోనూ ఫర్వాలేదనపించి.. ఆఖరి రెండు వన్డేల్లో 77,78తో చుక్కలు చూపించాడు.
టీమిండియా కెప్టెన్.. బెంగళూరు బాద్‌షా
ప్రత్యర్థి విధించిన టార్గెట్‌ను ఛేదించడంలో రారాజు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ వేదికగా టీమిండిగా సారథిగా కొనసాగుతున్నారు. కోహ్లీ ఆట, ఆయన నాయకత్వం గురించి పెద్దగా విశ్లేషణలు సైతం అక్కర్లేదు. టీమిండియా తరఫున ఎన్ని గొప్ప విజయాలు సాధించాడో అందరం చూస్తున్నాం. అయితే.. ఐపీఎల్‌లో మాత్రం తాను సారథ్యం వహిస్తున్న బెంగళూరుకు మాత్రం ట్రోఫీ అందించలేకపోతున్నాడు. సారథిగా 125 మ్యాచ్‌లు ఆడగా.. 57 మ్యాచ్‌లు గెలిచి.. 64 ఓడాడు. 4 ఫలితం తేలలేదు. ఆటగాడిగా 192 మ్యాచుల్లో 38.16 సగటు, 130 స్ట్రైక్‌రేట్‌తో 5,878 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు, 201 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2021లోనూ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 72, 62తో అలరించాడు. ఆ తర్వాత రెండు డక్‌లతో నిరాశ పరిచాడు. టీ20ల్లో 73*, 77*, 80*, వన్డేల్లో 56,66తో దుమ్మురేపాడు.
పంజాబ్ కేరాఫ్ రాహుల్
పంజాబ్ జట్టు ఐపీఎల్‌లో ఇంతవరకు ట్రోఫీ గెలవలేదు. ఇక ఇప్పుడు తన పేరు సహా అన్నీ మార్చేసుకుంది. కొత్త రూపు సంతరించుకుంది. కేఎల్ రాహుల్ నాయకత్వంపై ఆశలెన్నో పెట్టుకుంది. గతేడాది సారథిగా 14 మ్యాచుల్లో 6 గెలిచి 8 ఓడాడు. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఐదు విజయాలు నమోదు చేయడం ప్రత్యేకం. కీపర్‌గానూ, బ్యాట్స్‌మెన్‌గానూ దుమ్మురేపాడు. 670 పరుగులతో ఆరేంజ్ క్యాప్ అందుకున్నాడు. మొత్తం 81 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 44.86 సగటు, 135 స్ట్రైక్‌రేట్‌తో 2,647 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు, 104 సిక్సర్లు ఖాతాలో ఉన్నాయి. గాయంతో ఆసిస్ నుంచి వచ్చేసిన రాహుల్ ఇంగ్లాండ్‌తో టీ20ల్లో 1,0,0,14తో ఇబ్బంది పడ్డాడు. కానీ వన్డేల్లో 62*, 108తో అదరగొట్టాడు.
రాయల్ సంజు
ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్లు ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ సారథిగా ఎంపికయ్యాడు. అత్యంత చిన్న వయసులో కేరళ రంజీ జట్టుకు నాయకత్వం అందించిన అనుభవం ఉంది. కెప్టెన్ అయ్యాక పరుగుల వరద పారించాడు. కండబలంతో భారీ సిక్సర్లు బాదే సంజు ఐపీఎల్‌లో మొత్తం 107 మ్యాచ్‌లు ఆడి 27.78 సగటు, 133 స్ట్రైక్‌రేట్‌తో 2,584 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు, 115 సిక్సర్లు బాదేశాడు. కీపింగ్ (52 క్యాచులు, 6 స్టంపౌట్లు)లోనూ అదరగొట్టాడు. తనదైన రోజున విధ్వంసం సృష్టించే శాంసన్ ప్రధాన లోపం నిలకడ కోల్పోవడం. పోటీ వల్ల జాతీయ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. 2021లో దేశవాళీ క్రికెట్లో భారీ పరుగులు ఏమీ చేయలేదు. టీ20ల్లో హరియాణాపై 51, లిస్ట్ ఏలో రైల్వేస్‌పై 61 మాత్రమే చేయగలిగాడు.
ధోనీ.. కింగ్ అయ్యేనా..!
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రెండో జట్టు చెన్నై సూపర్‌కింగ్స్. ఎంఎస్ ధోనీ నాయకత్వం వహిస్తున్న ఈ టీమ్ 3 సార్లు ట్రోఫీ అందుకుంది. గతేడాది మినహాయిస్తే ప్రతీసారి ప్లేఆఫ్స్‌కు చేరింది. అందరి కన్నా ఎక్కువగా 174 మ్యాచ్‌లకు ధోనీ సారథ్యం వహించాడు. 105 గెలిచి.. 68 ఓడాడు. 1 మ్యాచ్ ఫలితం తేలలేదు. మొత్తంగా 204 మ్యాచ్‌ల్లో 40.99 సగటు, 136.75 స్ట్రైక్ రేట్‌తో 4,632 పరుగులు సాధించాడు. 23 హాఫ్ సెంచరీలు, 216 సిక్సర్లు ఖాతాలో ఉన్నాయి. కీపర్‌గా 113 క్యాచ్‌లు, 39 స్టంపౌట్లు చేశాడు. అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీకి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. గతేడాది 14 మ్యాచుల్లో 200 పరుగులు మాత్రమే చేశాడు.
బాహుబలి వార్నర్
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైటర్స్ హైదరాబాద్‌కు తొలి ట్రోఫీ అందించాడు డేవిడ్ వార్నర్. 2016లో విరాట్ కోహ్లీ దూకుడును నిలువరించాడు. బాల్ ట్యాంపరింగ్‌తో ఒక ఏడాది టోర్నీకి దూరమైన వార్నర్.. తిరిగి పగ్గాలు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించాడు. మొత్తం 142 మ్యాచుల్లో 42.17 సగటు, 141.54 స్ట్రైక్ రేట్‌తో 5,254 పరుగులు చేశాడు. 4సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు 195 సిక్సర్లు బాదేశాడు, కెప్టెన్‌గా 51 మ్యాచుల్లో 34 గెలిచి 26 ఓడాడు. స్వదేశంలో టీమిండియా సిరీస్‌లో అతడు గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే.. మార్చిలో లిస్ట్ ఏ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. 87,24,69,108తో ఫామ్‌లోకి వచ్చాడు.
మోర్గాన్ మోత మోగించేనా..
రెండుసార్లు విజేత కోల్‌కతా నైడర్స్ ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌పై భారీ ఆశలే పెట్టుకుంది.తనకు మూడో కప్పు అందిస్తాడని ధీమాగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో నాయకుడిగా మోర్గాన్‌కు మంచి అనుభవం ఉంది. ప్రత్యర్థిని చక్కగా అంచనా వేసి బౌలర్లను ప్రయోగించడంలో దిట్ట. ప్రశాంతంగా ఉంటాడు. బ్యాంటింగ్‌లోనూ తిరుగులేదు. ఐపీఎల్‌లో 66 మ్యాచ్‌లాడిన అతడు 25.44 సగటు, 126.31 స్ట్రైక్‌రేట్‌తో 1,272 పరుగులు చేశాడు. 5 హాఫ్ సెంచరీలు, 58 సిక్సర్లు బాదేశాడు. గతేడాది సారథిగా 7 మ్యాచుల్లో 3 గెలిచి 4 ఓడాడు. 2021లో అతడి ఫామ్ సాధారణమే. కోహ్లీసేనతో 5 టీ20ల్లో రెండింట్లో బ్యాటింగ్‌కు రాలేదు. మిగతా మ్యాచుల్లో 28,4,1 మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 22 మాత్రమే చేశాడు. గాయంతో ఆఖరి రెండు వన్డేలకు దూరమయ్యాడు.