Washington Sundar: అప్పటిదాకా దూసుకుపోతున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు వాషింగ్టన్ సుందర్ బ్రేక్ వేశాడు. వెంట వెంటనే వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ జట్టును నేలకు దించాడు. జట్టులో తనకు స్థానం ఇస్తే.. నవ్వినవారికి.. ఆటతీరుతోనే సమాధానం చెప్పాడు. 7 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ జట్టుకు కోలు కోలేని షాక్ ఇవ్వడం కాదు.. తనలో ఉన్న అసలు సిసలైన స్పిన్ బౌలర్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. వాస్తవానికి 2020-21 సీజన్లో ఐపీఎల్లో సుందర్ రాణించాడు. దీంతో ఆ ఏడాది ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు వెళ్లాడు. అయితే అతడు నెట్ బౌలర్ గా ఎంపికయ్యాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. దీంతో గబ్బా టెస్టులో వాషింగ్టన్ సుందర్ కు ఆడే అవకాశం వచ్చింది. దానిని అతడు చక్కగా వినియోగించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లలో నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక రంజీ ట్రోఫీలో ఇటీవల ఢిల్లీ జట్టుపై 152 రన్స్ చేశాడు వాషింగ్టన్ సుందర్. తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టుపై కేఎల్ రాహుల్, కులదీప్ యాదవ్, సిరాజ్ వంటి వారు నిరాశపరిచారు. దీంతో జట్టు మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇచ్చింది. అయితే జట్టు మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని సుందర్ వమ్ము కానివ్వలేదు. రంజీ ట్రోఫీ మాదిరిగానే న్యూజిలాండ్ జట్టుపై బౌలింగ్ చేశాడు. మెలికలు తిప్పుతూ ఏకంగా ఏడు వికెట్లను పడగొట్టాడు.
అందువల్లే ఆ పేరు
సుందర్ పేరు ముందు వాషింగ్టన్ అని ఉంటుంది. ఇంతకీ అది ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. అయితే ఓ విశ్రాంత ఆర్మీ ఆఫీసర్ మీద అభిమానంతో సుందర్ తండ్రి అతని పేరు ముందు వాషింగ్టన్ అని నామకరణం చేశాడు. సుందర్ తండ్రి పేరు మణి సుందర్. ఒకప్పుడు అతడు రంజి ఆటగాడు. కాకపోతే అతడికి పేద కుటుంబం. ఈ క్రమంలో అతనికి పిడి వాషింగ్టన్ అనే విశ్రాంత ఆర్మీ అధికారి ఆర్థికంగా సహాయం చేశాడు. అతడి చదువుకు ఉపకరించాడు. దీంతో అతనిపై ఉన్న అభిమానానికి గుర్తుగా తన కుమారుడి పేరు ముందు “వాషింగ్టన్” ను చేర్చాడు మణి సుందర్. ఇక అప్పటినుంచి సుందర్ కాస్త వాషింగ్టన్ సుందర్ గా మారిపోయాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఏడు వికెట్లు సాధించి.. ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. అయితే వాషింగ్టన్ సుందర్ ఇదే ప్రదర్శన వచ్చే మ్యాచ్ లలో కొనసాగిస్తే అతడికి టీమ్ ఇండియాలో సుస్థిర స్థానం లభిస్తుందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.